తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌పై మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు నమోదైంది. కాంగ్రెస్ దివ్యాంగుల విభాగం రాష్ట్ర ఛైర్మన్ ముత్తినేని వీరయ్య కేటీఆర్‌పై కంప్లెయింట్ చేశారు. ఇటీవల ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుడ్డి గుర్రాల పళ్లు తోముతున్నారా? గుడ్డి ద్వేషం ఎందుకు ? వంటి వ్యాఖ్యలతో దివ్యాంగుల మనోభావాలు కించపరిచేలా, ఆత్మనూన్యతభావానికి లోనయ్యేలా కేటీఆర్ ప్రవర్తించారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు.
రాష్ట్ర మంత్రిగా దివ్యాంగుల చట్టాలను గౌరవించి, వాటిని అమలుపరచాల్సిందిపోగా.. బాధ్యతారహిత్యంగా మాట్లాడారని ముత్తినేని వీరయ్య ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగులను కించపరిచేలా మాట్లాడటం.. వికలాంగుల హక్కుల చట్టం 2016, సెక్షన్ 92 ప్రకారం నేరం అని.. కాబట్టి వారిని అవమానపరిచిన మంత్రి కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని వీరయ్య హెచ్చార్సీకి విజ్ఞప్తి చేశారు. కాగా ఈ ఫిర్యాదుపై నేటి మధ్యాహ్నం 3గంటలకు హెచ్చార్సీ విచారించనుంది.