కోడి కత్తి కేసు ఈ రోజు ఎన్ఐఏ కోర్టులో విచారణకు వచ్చింది. ప్రత్యక్ష సాక్షి ఎయిర్ పోర్టు అసిస్టెంట్ దినేష్ కుమార్ ఈ విచారణకు గైర్హాజరు కావడంతో కేసు వాయిదా పడింది. దినేష్ కుమార్ తండ్రి మరణించారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తండ్రి మరణం నేపథ్యంలో దినేష్ కుమార్ విచారణకు హాజరు కాలేరని ఆయన తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
దీంతో కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 15కు న్యాయస్థానం వాయిదా వేసింది. విచారణ నేపథ్యంలో కోడి కత్తి కేసు నిందితుడు శ్రీను ఈ రోజు విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు వచ్చారు. ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం జగన్ కూడా తదుపరి విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది.
2019 ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై కోడి కత్తితో దాడి జరిగింది. 2018లో ఆయన ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేపట్టారు. ఆ సమయంలో హైదరాబాద్ కోర్టులో కేసు విచారణకు ఆయన హాజరుకావాల్సి వుంది. దీంతో ఒక రోజు ముందు ఆయన విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
ఆయన వీఐపీ లాంజ్‌లో ఉన్న సమయంలో వెయిటర్ ఒకరు సెల్ఫీ తీసుకుంటానని జగన్ దగ్గరకు వచ్చాడు. వెంటనే జగన్ పై కోడి కత్తితో దాడి చేశాడు. దీంతో జగన్ భుజానికి గాయమైంది. ఈ క్రమంలో ఆయన 3 వారాల పాటు విశ్రాంతి తీసుకున్నారు.
ఈ కేసులో ఏ1గా జనిపల్లి శ్రీనివాసరావును పేర్కొన్నారు. 2019లో ఎన్ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది. తాజాగా నాలుగేండ్ల తర్వాత కేసు కోర్టులో విచారణకు వచ్చింది. ఈ దాడి టీడీపీ ప్రభుత్వం చేయించిందని వైసీపీ, ఎన్నికల ముందు సింపతి కోసం చేసి డ్రామాగా టీడీపీలు పరస్పరం విమర్శలు చేసుకున్నాయి.