వందల కోట్లు విలువ చేసే భూములున్న రంగారెడ్డి జిల్లాలో కబ్జారాయుళ్లు దేన్ని వదిలిపెట్టడం లేదు. చివరకు ప్రభుత్వభూములను కూడా గాయబ్ చేస్తున్నారు. తాజాగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి బడంగ్ పేట్ లో వికలాంగుల భవన నిర్మాణానికి శంకుస్ధాపన చేసిన శిలాఫలకాన్ని సైతం కూల్చివేసి కబ్జాకు తెగబడ్డారు. ఇక మంత్రి శంకుస్థాపన ఫలకాన్ని కూల్చేస్తే..సాధారణ జనాన్ని కబ్జారాయుళ్లను నుంచి కాపాడేదెవరని స్థానికంగా చర్చనీయాంశమైంది ఈ ఘటన.
ఇక వివరాల్లోకి వెళితే..మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కమిషనర్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.నాదర్గుల్ సర్వే నెంబర్ 78,79 మర్రి లక్ష్మమ్మ లేఔట్ పార్కు లో గత నెల 14వ తేదీన మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికలాంగులకు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీ సహాయం తో శిలా ఫలకాన్ని కూల్చేసినట్లు బడంగ్ పేట్ మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న మీర పేట్ సిఐ మహేందర్ రెడ్డి విచారణ మొదలు పెట్టారు. అయితే కబ్జారాయుళ్లకు రాజకీయంగా అండదండలుంటేనే ఇలా ప్రభుత్వ భూమిని అందులో మంత్రి చేతుల మీద శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని కూల్చివేస్తారని.. ఎవరైనా కాని చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.