– మన ఊరు మన బడిపై వరస కథనాలు
– టెండర్ల గుట్టు బయట పెట్టిన తొలివెలుగు
– టెక్నికల్ అర్హత అంటూ అక్రమాలకు తెర
– మంత్రి పుత్రరత్నం పాత్రపై అనుమానాలు
– మేఘాకి దోచిపెట్టడంపై హైకోర్టుకి వెళ్లిన వీ3 ఎంటర్ ప్రైజెస్
– టెండర్లపై స్టే విధించిన న్యాయస్థానం
– తదుపరి ఉత్తర్వుల వరకు ప్రక్రియ ఆపాలని ఆదేశం
– బాంబే హైకోర్టులోనూ మేఘాకు చుక్కెదురు
– ఈవీ వాహనాల టెండర్లకు బ్రేక్
క్రైంబ్యూరో,తొలివెలుగు:మన ఊరు మన బడి టెండర్ల విషయంలో జరిగిన గోల్ మాల్ పై తొలివెలుగు వరుస కథనాలు ఇచ్చింది. మన బడి.. మేఘాకు రాబడి అంటూ వార్తలు ఇచ్చింది. ఈ వ్యవహారంలో మంత్రి పుత్రరత్నం పాత్రపైనా అనుమానాలు ఉన్నాయి. సరిగ్గా ఇదే సమయంలో మన ఊరు మన బడి టెండర్లకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బ్రేక్ లు వేసింది. టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ వీ3 ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో తదుపరి విచారణ జరిగేంత వరకు ముందడుగు వేయవద్దని టెండర్లపై స్టే విధిస్తూ.. ఈ నెల 11కి వాయిదా వేసింది.
టెండర్లను ఫైనల్ చేయడంలో స్కూల్ ఎడ్యుకేషన్ పారదర్శకతను పాటించలేదని, నిబంధనలకు అర్హత లేకపోయినా.. కోన్ని సంస్థలకు క్లియర్ చేశారని పిటిషనర్ వాదన. ఎలిగెంట్ మెథడాక్స్ అనే సంస్థకు అర్హత లేకపోయినా.. నిబంధనలను భర్తీ చేసినట్లు పేర్కొని టెండర్లు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. టెండర్లలో పాల్గొన్న తమకి అన్నిఅనుమతులు, అర్హతలు ఉన్నా.. కారణాలు చెప్పకుండానే ఇవ్వలేదని పేర్కొన్నారు. అర్హత సాధించకపోతే.. దానికి తగిన కారణాలు టెంటర్ ఖరారు కమిటీ చూపించాలి. కానీ.. ఇప్పటి వరకు అధికారులు స్పందించ లేదని తెలిపారు.
పిటిషనర్ వాదనలను ఏకీభవిస్తూ హైకోర్టు స్టే విధించింది. ప్రతివాదులుగా తెలంగాణ రాష్ట్ర ఉమెన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్, ఎలిగెంట్ మెథడాక్స్ సంస్థను ప్రతివాదులుగా పేర్కొంది.
మేఘాకు వరుస దెబ్బలు
మేఘా సంస్థకు ఈమధ్య కోర్టుల్లో దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మీడియా తమ కంపెనీలపై వార్తలు రాయొద్దని ఖమ్మం కోర్టు నుంచి తెచ్చుకున్న తీర్పుని హైకోర్టు కొట్టివేసింది. ఎన్ఆర్ఐ కాలేజీ వ్యవహారంలో ఆర్బిట్రేటర్ ట్రైబ్యునల్ తీర్పు పై నూజివీడ్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. మంగళవారం అనుబంధ సంస్థ అయిన ఈవే కు 2,100 ఎలక్ట్రికల్ బస్సుల తయారీకి కేటాయించిన టెండర్ ను బాంబే హైకోర్టు రద్దు చేసింది. ఇప్పుడు మన ఊరు మన బడి టెండర్ల విషయంలోనూ ప్రస్తుతానికి స్టే విధించింది తెలంగాణ హైకోర్టు. రాజకీయ పలుకుపడితో మేఘా చట్టవిరుద్దంగా చేస్తున్న పనులకు న్యాయవ్యవస్థ చెక్ పెడుతోంది అని అంతా అనుకుంటున్నారు.