నందమూరి తారకరత్న మరణం.. అటు కుటుంబ సభ్యులను, ఇటు అభిమానులను కలచివేసింది. అందరూ చూస్తుండగానే…అందరితో పాదయాత్ర మొదలు పెట్టి అందరికీ అందనంత దూరం ప్రయాణించాడు తారక రత్న. అది మృత్యువు ఒడిలోకి కావడం బాధాకరం. ఇంటి పట్టున ఉంటే అతనికి ఇంత ప్రమాదం జరక్కపోయేదేమో కదా అనిపించక మానదు.
అయితే తారకరత్న ఆస్పత్రికి వచ్చినప్పుడు పల్స్ లేదని వైద్యులు చెప్పుకొచ్చారు. శరీరం నీలంగా మారిందని.. వెంటనే చికిత్స ప్రారంభించామని వారు పేర్కొన్నారు. తారకరత్న పల్స్ సాధారణ స్థితికి చేరుకునేందుకు 45 నిమిషాల సమయం పట్టిందని కూడా చెప్పారు.
కాస్త ముందుగా సీపీఆర్ చేసి ఉంటే ఆయన పరిస్థితి విషమంగా ఉండేది కాదని కొందరు చెప్పుకొస్తున్నారు. అయితే గత 23 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తిరిగి వస్తారని అనుకున్నారు. కాని ఎవరు ఊహించని విధంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
ఎమ్మెల్యేగా టీడీపీ పార్టీ నుంచి పోటీ చేద్దాం అనుకునేలోపు ఇలా జరిగిందని అభిమానులు బాధపడుతున్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ గురించి తారకరత్న మాట్లాడిన చివరి మాటలను అభిమానులు గుర్తుచేస్తున్నారు. తారకరత్నతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల అనుబంధం గురించి ప్రత్యేకం అని చెప్పాలి. ముఖ్యంగా తారకరత్నకు ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానమట.
కుప్పం పర్యటనలో భాగంగా తారకరత్నమాట్లాడుతూ ‘ఎన్టీఆర్ నా తమ్ముడే కదా, జూనియర్ ఎన్టీఆర్ ని వేరేగా చూడడం అనేది ఉండదు.ప్రేమగా చూడాలి అనే వాటిని నేను నమ్మను. నందమూరి బిడ్డ, నందమూరి రక్తం, నా తమ్ముడు. ఎన్టీఆర్ ఎప్పటికీ నా తమ్ముడు.
అన్నకి తమ్ముడి మీద ఎంత ఆప్యాయత ఉంటుందో అంతే ఆప్యాయత నాకు ఉంటుంది’ అని ఎన్టీఆర్ పై ఉన్న ప్రేమను తన మాటల్లో వెల్లడించారు తారకరత్న. ఎన్టీఆర్ గురించి తారకరత్న మాట్లాడిన ఆఖరి మాటలు కావడంతో అభిమానులు ఈ వీడియోని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ ఇంత మంచి మనిషి ఇలా అందరిని వదిలి వెళ్లడం బాధగా ఉందని అంటున్నారు.