నిజామాబాద్ జిల్లా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన నీలకంఠేశ్వర ఆలయంలో అపచారం జరిగింది. పుష్కరిణిలో దేవుని విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా.. ఆలయ ఈవో వేణు సరస్సులోకి దిగి ఈత కొట్టారు. అభిషేకం చేస్తున్నాం.. ఈత కొట్టవద్దు అంటూ అర్చకులు చెబుతున్నా.. ఈవో పట్టించుకోకుండా ఈత కొట్టడం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ అంశం కాస్తా చర్చనీయాంశంగా మారింది.
ఈవో వేణు తీరుపై భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈవోగా ఉంటూ పుష్కరిణిలో విగ్రహాలు అభిషేకం చేస్తున్నా పట్టించుకోకుండా ఈత కొట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నారనే ధీమాతో ఈవో ఇలా చేశాడంటూ సర్వత్రా మండిపడుతున్నారు.
ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తే వారిని శిక్షించాల్సింది పోయి ఆలయ ఈవోనే ఇలా చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈవో వేణుని తక్షణమే కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఇలాంటి వారి వల్లే ఆలయంలో అపచారాలు చోటు చేసుకుంటున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వీడియోపై ఉన్నతాధికారులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.