తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత చనిపోయిన తరువాత తమిళనాట రాజకీయాలు అనేక మలుపులు తిరిగాయి. దీంతో అన్నాడీఎంకేలో ద్వంద్వ నాయకత్వం మొదలైంది. ఇప్పటి వరకు పళని స్వామి, పన్నీర్ సెల్వం పార్టీ పగ్గాలను పంచుకున్న విషయం తెలిసిందే.
అయితే తాజాగా అన్నాడీఎంకేలో ద్వంద్వ నాయకత్వానికి తెరపడిందనే చెప్పవచ్చు. ప్రధాని కార్యదర్శి పదవిని పునరుద్దరిస్తూ పార్టీ సర్వసభ్య మండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి డిప్యూటి జనరల్ సెక్రటరీ పదవి ఉండాలని నిర్ణయించారు.
మరో నాలుగు నెలల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే తాత్కలిక ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామిని(ఈపీఎస్) నియమించింది.మాజీ సీఎం పళనిస్వామి అధ్యక్షతన అన్నాడీఎంకే సర్వసభ్య మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ కోఆర్డినేటర్, సంయుక్త కో ఆర్డినేటర్ పోస్టులను రద్దు చేస్తూ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.
దీంతో ఎవరైనా ఒక్కరే పార్టీ అధ్యక్ష బాధ్యలతను చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకు పళనిస్వామి, పన్నీర్ సెల్వం (ఓపీఎస్) పార్టీ పగ్గాలను పంచుకున్న విషయం తెలిసిందే. కాగా, పళనిస్వామి అధ్యక్షతన జరుగనున్న సర్వసభ్య సమావేశాలను అడ్డుకోవడానికి పన్నీర్ సెల్వం వర్గం ప్రయత్నించింది.
సమావేశాలను అడ్డుకోవాలని ఈపీఎస్ వర్గం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. సమావేశాలను యథావిధిగా జరుపుకోవచ్చని న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో ఓపీఎస్, ఈపీఎస్ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది.ఇరువర్గాలు పరస్పర దాడులకు దిగాయి. దీంతో అన్నాడీఎంకే కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈపీఎస్ వర్గానికి చెందిన కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో కుర్చీలు విరగొట్టారు.