ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన పల్లె ప్రగతి కార్యక్రమం గొడవలకు కేంద్రాలుగా మారుతున్నాయి. ఇప్పటికే సర్పంచులు తిరుగుబాటు స్వరం వినిపిస్తుండగా.. తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ను నిధుల విషయంలో జెడ్పీటీసీ హరివర్ధన్ రెడ్డి నిలదీయడంతో కార్యక్రమం రసాభాసగా సాగింది. ఇరువర్గాలు ఎవరికివారు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. వారికి సర్ధిచెప్పేందుకు పోలీసులు ముప్పుతిప్పలు పడ్డారు.
సోమవారం మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, మల్లారెడ్డి హాజరయ్యారు. అలాగే జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రా రెడ్డి, పంచాయతీ రాజ్ కమిషనర్ శరత్, కలెక్టర్ హరీష్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అయితే.. అధికారుల పనితీరుపై ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.
హరితహారం, వైకుంఠ ధామాలు, చెత్త నిర్వహణ సక్రమంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. డీపీవో రమణ మూర్తి, ఎంపీవో రవి నాయక్, కార్యదర్శులకు పని తీరు ఇలా ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం జెడ్పీటీసీ హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఏమైనా కేటాయించిందా? అని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీలో నిధులు లేక సర్పంచులు భిక్షాటన చేస్తున్న ఖర్మ పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు జెడ్పీటీసీ. సర్పంచులు తమ గోడును వినిపించేందుకు సంబంధిత మంత్రి అయిన మిమ్మల్ని కలిసేందుకు ప్రయత్నించినా సమయం ఇవ్వకపోవడం దారుణమని నిలదీశారు. దీంతో ఒక్కసారిగా టీఆర్ఎస్ శ్రేణులు హరివర్ధన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్టేజీపై నుండి కిందికి దిగాలని కేకలు వేశారు. సభా ప్రాంగణం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో హరివర్ధన్ రెడ్డి నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి అని ఇలాంటి తాటాకు చప్పులకు భయపడనని స్పష్టం చేశారు.
మరోవైపు మహిళలు పింఛన్లు రావడం లేదని మంత్రులను నిలదీశారు. ఈ క్రమంలోనే హరివర్ధన్ రెడ్డి బాధితులను పరామర్శించేందుకు వెళ్లగా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ వాళ్ల మాటలు నమ్మొద్దన్నారు. వచ్చే నెలలో మూడు చింతలపల్లి గ్రామంలోని 200 మందికి పింఛన్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ గ్రామాన్ని సీఎం దత్తత తీసుకుని ఎంతో అభివృద్ధి చేసారని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.