టీఆర్ఎస్, బీజేపీ మాటల యుద్ధం మరింత ముదురుతోంది. కేసీఆర్ ను జైల్లో వేస్తామని బండి సంజయ్ ప్రకటన చేసిన కొన్ని గంటలకే దేశంలో బీజేపీని కూకటివేళ్లతో పెకిలిస్తామని కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు మంత్రుల వంతు. బండి వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడడం ఆపాలంటూ మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ మీద చేయ్యేస్తే తెలంగాణ ప్రజలు ఉరికించి కొడతారని హెచ్చరించారు.
దేశంలో రైతులకు మేలు చేస్తున్న నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు ఎర్రబెల్లి. ఎరువుల ధరల పెంపు, ఇతర అంశాలపై మోడీకి కేసీఆర్ లేఖ రాశారని చెప్పారు. ధరలు తగ్గించే వరకు కేంద్రంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రైతులపై పెనుభారం మోపేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. ఎరువులపై పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ఇప్పటికే కేంద్రం రైతుల నడ్డి విరిచిందన్నారు ఎర్రబెల్లి. అది చాలదన్నట్టు ఇప్పుడు ఎరువుల ధరలు కూడా పెంచి వారిని ముంచేస్తోందని మండిపడ్డారు. పైగా తెలంగాణ బీజేపీ నేతలు ఎరువుల ధరలు పెంచడాన్ని సమర్ధించేలా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు.
కేసీఆర్ ను తిడితే పాపం తగిలి నాశనమైపోతారని శాపనార్ధాలు పెట్టారు ఎర్రబెల్లి. ఆయన రైతులకు ఎంతో మేలు చేసిన మహానుభావుడు అంటూ కొనియాడారు. ఇక రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ.. టీడీపీలో ఉన్నపుడు కాంగ్రెస్ విధానాలపై పోరాటం చేయలేదా? అని ప్రశ్నించారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎంత మేలు చేసిందో రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు ఎర్రబెల్లి.