తెలంగాణలో రాజకీయ సమీకరణాలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి. ఇంతకు ముందే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. త్వరలోనే బీజేపీలో చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం టీఆర్ ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, మాతో టచ్ లో ఉంటున్నారని బాంబు పేల్చారు.
ఈ రాజకీయ పరిస్థితుల్లో టీఆర్ ఎస్ కి మరో ముఖ్యనేత రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ మంత్రి వర్గంలో ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు పార్టీకి బై… బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ నెల 7వ తేదీన టీఆర్ ఎస్ కు రాజీనామా చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ క్రమంలోనే రేపు తన అనుచరులతో ప్రదీప్ రావు ప్రత్యేక సమావేశం నిర్వహించి, టీఆర్ ఎస్ కు రాజీనామాతో పాటు తన భవిష్యత్ ప్రణాళికలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే… ఇప్పటికే 2024 ఎన్నికలే లక్ష్యంగా చేసుకొని టీఆర్ ఎస్,కాంగ్రెస్,బీజేపీ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.2024 లో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటికే ఆయా పార్టీల జాతీయ నేతలు తెలంగాణలో పర్యటిస్తూ పార్టీల బలోపేతానికి ప్రయత్నాలు చేస్తున్నారు.