ఇండోనేషియాలోని అగ్ని పర్వతం బద్ధలైంది. జావా ద్వీపంలోని సెమెరు అగ్నిపర్వతం ఆదివారం తెల్లవారుజామున బద్ధలైంది. 1.5 కిలోమీటర్ల మేర గాలిలోకి బూడిద ఎగిసిపడిందని, ప్రజలు దూరంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది. అగ్నిపర్వతం నుండి 5 కిలోమీటర్ల లోపల ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని ఇండోనేషియావిపత్తు ఉపశమన సంస్థ (బిఎన్‌పిబి) సంస్థ సూచించింది.
అగ్నిపర్వతం నుండి వస్తున్న లావాకు 500 మీ దూరంలో ఉండాలని తెలిపింది.ఈ అగ్నిపర్వత విస్పోటనం వల్ల సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ ఏజెన్సీ వెల్లడించింది. అగ్నిపర్వతం ఆదివారం ఉదయం 2.46 గంటల నుంచి విస్పోటనం చెందడం ప్రారంభించిందని తెలిపింది.
ఇండోనేషియా అధికారులు సమీప ప్రాంతాల ప్రజలకు మాస్కులను పంపిణీ చేశారు. ఇండోనేషియాలో మొత్తం 142 అగ్నిపర్వతాలు ఉన్నాయి. అగ్నిపర్వతాల చుట్టూ 10 కిలోమీటర్ల లోపల దాదాపుగా 86 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు.
హవాయి దీవిలోని మౌనా లోవా నుంచి తీవ్రంగా వాల్కనో విరజిమ్ముతున్నది. నవంబర్ 27 నుంచి విస్పోటనం చెందుతున్నది. దీంతో పరిసర ప్రాంతాలన్నీ లావా ప్రవాహం, బూడిదతో నిండిపోయాయి. దాదాపు 20 నుంచి 25 అడుగుల ఎత్తువరకు లావాఎగిసిపడుతున్నది.
లావా ప్రవాహం గంటకు దాదాపు 200 అడుగుల వేగంతో ఈశాన్య దిశలో ముందుకు సాగుతున్నదని హవాయి అధికారులు తెలిపారు. 1984 తర్వాత మౌనా లోవా నుంచి పెద్ద ఎత్తున లావా వెలువడటం ఇదే తొలిసారి.