తెలంగాణ న్యాయ చరిత్రలో సరికొత్త శకం ఆరంభమైంది. రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో ఒకేసారి 32 డిస్ట్రిక్ట్ కోర్టులు ప్రారంభమయ్యాయి. గురువారం హైకోర్టు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్ సంయుక్తంగా కొత్త డిస్ట్రిక్ట్ కోర్టులను ప్రారంభించారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల్లోనే జిల్లా కోర్టులు ఉన్న నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు కొత్త జిల్లాల్లో 32 డిస్ట్రిక్ట్ కోర్టుల ఏర్పాటుకు హైకోర్టు అనుమతించింది. ఈ జ్యుడిషియల్ జిల్లాలను, వాటి పరిధిని గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవోలు జారీ చేసింది.
కొత్త జిల్లాల్లో కోర్టుల ఏర్పాటుతో కింది స్థాయిలో కేసుల విచారణ వేగవంతంగా జరుగుతుందని సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పులకు కొందరు వక్రభాష్యం చెప్పి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆయన మండిపడ్డారు. పరిమితులు దాటిన వారిని ఉపేక్షించేది లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు సీజేఐ. కొత్త రాష్ట్ర భవిష్యత్తుపై గతంలో అనుమానాలు ఉండేవని కానీ.. ఎనిమిదేళ్లలో అనుమానాలన్నీ తొలగిపోయాయని రమణ వ్యాఖ్యానించారు.
కోరిన వెంటనే హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సహకరించారని తెలిపారు సీఎం కేసీఆర్. జిల్లా కోర్టుల ఏర్పాటుపైనా వేగంగా నిర్ణయాలు తీసుకున్నామని సీఎం తెలిపారు. మెదక్ జిల్లాలోని తూర్పు ప్రాంతంలో ఉండే సిద్ధిపేట తన స్వస్థలమని.. జిల్లా రాజధాని సంగారెడ్డి అని కేసీఆర్ తెలిపారు. తమ ఊరు నుండి సంగారెడ్డి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటోందని.. సెషన్స్ కోర్టుకు వెళ్లేటప్పుడు అప్పట్లో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisements
కొత్తగా ఏర్పాటు చేసిన 32 జిల్లా కోర్టులకు భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. అన్ని జిల్లాలకు పోర్టు పోలియో జడ్జీలను హైకోర్టు నియమించడంతో పాటు.. న్యాయమూర్తులను సైతం అపాయింట్ చేయడం ఆనందంగా ఉందని తెలిపారు సీఎం.