రాష్ట్రాలకు ఆర్థిక సాయంగా రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దీని ద్వారా రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. కేంద్ర బడ్జెట్ సమావేశం సందర్భంగా నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తూ.. దేశ వ్యాప్తంగా జిల్లాల వారీగా వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి పథకం రూపొందించినట్లు చెప్పారు. 2022- 2023 మొత్తం బడ్జెట్ అంచానాలు రూ.39.45లక్షల కోట్లుగా ఉన్నట్టు వెల్లడించారు. ద్రవ్యలోటు 6.9శాతం ఉంటుందని.. 2025- 26నాటికి దాన్ని 4.5శాతానికి తగ్గించడమే లక్ష్యమని నిర్మలా సీతారామన్ తెలిపారు.
పీఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్ గురించి మంత్రి మాట్లాడారు. ఈ మాస్టర్ ప్లాన్ కింద 2022-23లో 25 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నెట్‌వర్క్ ను విస్తరించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.100 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఇందులో ప్రాథమికంగా సమగ్ర అభివృద్ధి, ఉత్పాదకత పెంపుదల, ఇంధన ప్రసారం, క్లైమేట్ యాక్షన్, పెట్టుబడులకు ఆర్థిక సహాయం వంటి సంపూర్ణ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెడుతున్నట్టు ఆమె తెలిపారు.
వివిధ కారణాల వల్ల మన దేశం.. దశాబ్దాల నుంచి మౌలిక సదుపాయాల కల్పనలో వెనుకబడి ఉందన్నారు. శాఖల మధ్య సమన్వయ లోపం లేకపోవడం ప్రధాన కారణమని వ్యాఖ్యానించారు. రోడ్ల శాఖ వారు కొత్త రోడ్లు వేస్తే.. వాటిని ఇతర శాఖల వారు తవ్వడం మనం చూస్తేనే ఉన్నాం.. ఇలాంటి బేసిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఒక పక్కా మాస్టర్ ప్లాన్ వేయనున్నామని తెలిపారు. ఏ శాఖ ఏ పని ఎప్పుడు చేస్తుందో.. సమగ్ర వివరాలు పోర్టల్ లో ఉంటాయని.. అప్పుడు శాఖల మధ్య సమన్వయ లోపానికి అవకాశం ఉండదని చెప్పారు.
ఈ మాస్టర్ ప్లాన్ లో మల్టిపుల్ మోడల్ కనెక్టివిటీ కోసం రైల్వేలు, రోడ్ వేలతో సహా 16 మంత్రిత్వ శాఖలను ఏకీకృతం చేయనున్నారు. ప్రణాళిక, మౌలిక సదుపాయాల కనెక్టివిటీ కోసం అందరూ కనెక్ట్ అయ్యి పని చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఉపాధి అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని.. పేదరిక నిర్మూలనకు తోడ్పడుతోందని నిర్మలాసీతారామన్ చెప్పారు.