పండగంటే ప్రకృతిని ఆరాధించడం. గణపతి నవరాత్రులంటేనే మట్టి పండగ. చెరువుమట్టిని తెచ్చి ప్రతిమగా మలచి.. పత్రాలు, పుష్పాలు, ఫలాలతో పూజించడం. కానీ.. రాను రాను పండుగ రూపు మారింది. ప్లాస్టరాఫ్ పారిస్ విగ్రహాలతో జలవనరులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. అయితే ఎక్కడో ఓచోట ఎకో ఫ్రెండ్లీ అనే పదం వినిపిస్తూనే ఉంటుంది. సికింద్రాబాద్ మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ కు వెళ్తే కాయసారం ఈశ్వరయ్య కుటుంబం కూడా అంతే.
అందరి కళ్ళముందే బంక మన్నుతో గణపతి ప్రతిమలను ఆకర్షణీయంగా తయారు చేసి భక్తులకు అందించి పర్యావరణ పరిరక్షణలో భాగమవుతోంది ఈ కుటుంబం. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని విగ్రహాలను తయారు చేసి ప్రజలకు అందిస్తోంది. ధరలు లేకుండానే భక్తులు ఎంత ఇస్తే అంత తీసుకుంటోంది. వినాయక ప్రతిమలు తీసుకొనే భక్తులు బియ్యమో, డబ్బులో ఇచ్చి వెళ్తుంటారు. ఎన్నో ఏళ్లుగా స్థానికంగా ఇది ఆనవాయితీగా వస్తోంది.
దాదాపు 160ఏళ్ల నుంచి ఈశ్వరయ్య కుటుంబం ఇలా గణేష్ ప్రతిమలు తయారు చేసి ఇస్తోంది. కేవలం గణపతి ప్రతిమలే కాకుండా బోనాల పండుగకు పచ్చి కుండలను కూడా అందిస్తోంది. కులవృత్తినే నమ్ముకొని జీవిస్తున్న ఇలాంటి కుటుంబాన్ని గుర్తించి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.