భాగ్యనగర్ జిల్లా బీజేపీ శిక్షణా తరగతులను బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రారంభించారు. చాంద్రాయణగుట్ట మహావీర్ కాలేజీలో మూడు రోజుల పాటు ఈ శిక్షణ తరగతులు జరగనున్నాయి. ప్రాంతీయ పార్టీలు అంటేనే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలుగా పని చేస్తాయి. వారు, వారి కుటుంబ ప్రయోజనాలు తప్ప ప్రజల శ్రేయస్సు గురించి పట్టించుకోరని ఈటల ఆరోపించారు.
కేసీఆర్ పాలనలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయ్యిందన్నారు ఈటల. పుట్ట బోయే బిడ్డకు కూడా ముందుగానే ఒక లక్ష రూపాయలు అప్పు పెట్టారని మండిపడ్డారు. నెల నెలా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పిల్లల మెస్ బిల్లులు కూడా ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. అంగన్వాడి కేంద్రాలలో పిల్లలకు అన్నం పెట్టలేని దుర్భరమైన స్థితిలో రాష్ట్రం ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం అని ఆశాభావం వ్యక్తం చేశారు ఈటల.