తెలంగాణ సీఎం కేసీఆర్ కి నిత్యం రాజకీయ క్రీడ తప్ప మరో ప్రజా సమస్యలపై ధ్యాస లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటి నుంచే పొత్తులకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో గెలవడానికి కేసీఆర్ తెలంగాణ ద్రోహులుగా ముద్రపడిన సీపీఎంతో నయా దోస్తానా చేయడం శోచనీయమని అన్నారు.
తెలంగాణలో సమస్యలు పోగుపడి ఉన్నాయని.. అవన్నీ గాలికొదిలేసి కేసీఆర్ ఎన్నికల పోత్తుల్లో బిజీ అయిపోయారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవోతో ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా పోతుందని ఈటల అన్నారు. జిల్లాల సంఖ్య పది నుంచి 33కి, జోన్లు రెండు నుంచి ఏడుగా మార్చారని గుర్తు చేశారు. రాష్ట్రపతి సవరణ చేసి జీవో నెంబర్ 124 ఇచ్చారని.. స్థానికత ఆధారంగా టీచర్లను, ఉద్యోగులను విభజించాలని డిమాండ్ చేశారు.
మూడేళ్ల పాటు కుంభకర్ణ నిద్ర పోయిన తర్వాత జీవో నెంబర్ 317 ఇచ్చారని మండిపడ్డారు. తొందరపాటు నిర్ణయంతో జీవో ఆర్డర్ ఇవ్వడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భార్య ఒక దగ్గర భర్త మరో దగ్గర, పిల్లలు, కన్నతల్లిదండ్రులు ఇంకో దగ్గర.. ఇలా ఎడబాటు విధించి వారి కుటుంబాలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ఈ బాధలు తట్టకోలేక టీచర్లు, ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి సమస్యలను పక్కన పెట్టి.. సీపీఐను ఎలా దగ్గర తీసుకోవాలని సీఎం ఆలోచిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎలా పుల్లలు పెట్టాలి? బీజేపీని ఎలా దెబ్బ కొట్టాలి అనే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. మళ్లీ గెలవాలని నీతిమాలిన చర్యలు చేపడుతున్నారని విమర్శించారు.