రైతులను గాలికి వదిలి ఫామ్ హౌస్ లో కూర్చిని కేసీఆర్ పాలన సాగిస్తున్నారు అని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటలరాజేందర్. శుక్రవారం ఆయన మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని పలు గ్రామాలతో పాటు.. గిటిజన తండాల్లో రైతులతో మాట్లాడారు. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు ఈటల.
తర్వాత తొర్రూరు మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మానుకోట జిల్లాలో తండాలలో ఉన్న గిరిజనులంతా తెలంగాణ వస్తే బాగుపడతాం అనుకున్నాం..కానీ.. తమ బతుకులు ఇట్ల ఆగం అయితాయనుకోలేదు అని తనతో మొరపెట్టుకున్నారని తెలిపారు. ఏ పంట వేయాలన్న బయమైతుందని కంటనీరు పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గిట్టుబాటు ధరను కల్పించాలని, లేదంటే తమకు ఆత్మహత్య మాత్రమే దిక్కు అని వారంతా బోరుమంటున్నారన్నారు. మిర్చి పంట వేస్తే లాభాలు వస్తాయి అనుకుంటే.. రోగాలు వచ్చి పెట్టుబడిలో పది శాతం కూడా రాలేదని బాధపడ్డారు అని అన్నారు. కూరగాయలు వేసిన కోతుల బెడద ఉందని వాపోతున్నారని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో విషాద వాతావరణం నెలకొని ఉందన్నారు ఈటల. సీఎం ప్రగతిభవన్ లో కూర్చుని నేను రైతు బంధు ఇస్తున్నాను.. రైతుల జీవితాలు మూడుపువ్వులు ఆరుకాయలుగా ఉందని భావిస్తున్నారని.. కానీ రైతులు ఎండిన ఆకులు.. రాలిన పూవ్వుల్లా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని రైతుల గొడులను తెలుసుకోవాలని డిమాండ్ చేశారు ఈటల.