పెన్షన్ల పేరుతో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల ఓట్లను దండుకొని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని మోసం చేసిన ఘనుడు సీఎం కేసీఆర్ అని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. దేశంలో ఎక్కడా లేని వడ్ల సమస్య ఒక్క తెలంగాణలోనే ఎందుకొచ్చిందని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రజలకు చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు.. కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఈటల. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబం అధికారం చెలాయిస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు విలువలు లేవని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ పని చేయాలన్నా కేసీఆర్ దే తుది నిర్ణయమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కేసీఆర్ ఒంటికన్ను రాక్షసుడిగా మారాడని విమర్శలు గుప్పించారు. హుజురాబాద్ ఎన్నికల తర్వాత కేసీఆర్ అయోమయంలో పడ్డారని విమర్శించారు.
ఎప్పుడైన గంటలకొద్దీ ప్రెస్ మీట్స్ ఉన్నాయా..? మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారని నిలదీశారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారని పేర్కొన్నారు.