భారతంలో అర్జునుడి గురి పక్షి కన్ను మీద ఎలానో.. మన గురి కేసీఆర్ కుర్చీ మీద ఉండాలనీ, మన లక్ష్యం కేసీఆర్ ను గద్దె దించటం కావాలని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులతో బండి సంజయ్ సంగ్రామ యాత్ర సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ గడ్డ మీద బీజేపీ గెలిచే వరకు మేము అండగా ఉంటామని ప్రధాన మంత్రి మోడీ గజేంద్ర సింగ్ షెకావత్ ను దూతగా పంపించారని చెప్పారు.
ఆయనతో ఓ ముఖ్యమైన వ్యక్తి బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినట్లు పేర్కొన్నారు. 2014 ముందు కులం, మతం అనే సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడం. అలానే ఇప్పుడు బీజేపీ ని రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చేందుకు పోరాడదామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నీకు నీ వెన్ను ఎలా అయితే కనిపించడం లేదో. అలాగే రాష్ట్రంలో ప్రజలు నీ గురించి ఏమి అనుకుంటున్నారో కూడా నీకు వినిపించడం లేదని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ అనే రాజు ఒక అద్దాల మేడలో ఉంటున్నారు. ఒక్క రాయి విసిరితే ఆ అద్దాల మేడ పగిలిపోతుంది. ఆ రోజు తొందర్లోనే ఉందన్నారు. కేసీఆర్ అనే రాజు ఉంటే ప్రగతి భవన్.. లేకుంటే ఫామ్ హౌస్ లో ఇనుప కంచెల మధ్య, పోలీసుల పహారాలో పాలన కొనసాగిస్తున్నారంటూ విమర్శించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరిని కదిలించినా.. ఒక్కటే నినాదం.. అదే కేసీఆర్ ను బొందపెట్టే నినాదం. టీఆర్ ఎస్ ను మట్టికరిపించే అవకాశం ఇప్పటికి హుజురాబాద్,కరీంనగర్ ప్రజలకు దక్కింది. త్వరలో నల్గొండ జిల్లా ప్రజలకు దక్కబోతోంది అన్నారు.
దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్.. మాట తప్పి మోసం చేశాడు. అదే మోడీ ని చూస్తే ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిని చేశారు. ఇక్కడేమో కేసీఆర్ గిరిజనులపై లాఠీఛార్జి చేస్తూ… వాళ్లని తీవ్రంగా హింసిస్తున్నాడు.
ఈ రోజు బీజేపీ ఎక్కడైనా సరే రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. దేశంలో 29 రాష్ట్రాల్లో…19 రాష్ట్రాల్లో బీజేపీ పరిపాలన సాగిస్తోంది.ఇప్పుడు తెలంగాణ 20వ రాష్ట్రంగా పాలించబోతోంది. కేసీఆర్ దుర్మార్గపు పాలనకు అంతం పాడుదాం. అర్జునుడికి పక్షి కనపడినట్లు, మనం కేసీఆర్ ను గద్దె దించడమే కనపడాలి అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ఒక అంతరించిపోతున్నపార్టీ… పార్టీకి మూలమైన యూపీలోనే కనీసం దానికి స్థానం లేదు. అలాంటిది దేశంలో మరో చోట ఎలా వస్తుందని ప్రశ్నించారు.