టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరిపోయే దీపమని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. పోలీసులు అధికార పక్షానికి కొమ్ము కాస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆయన ఆరోపించారు. బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన తీరు ప్రభుత్వ క్రూరత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. తెలంగాణలో అణచివేసే ప్రయత్నం యదేచ్చగా కొనసాగుతుందని అన్నారు. ఇక్కడ ఉన్న చట్టం, పోలీస్ లు టీఆర్ఎస్ పార్టీ కోసం మాత్రమే పని చేస్తూ.. ప్రజల తరపున మాట్లాడేవారిని అరెస్టులు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
నల్లగొండలో సీఎం పర్యటన చేస్తే.. కేటీఆర్ బైక్ ర్యాలీ నిర్వహిస్తే.. అప్పుడు లేని నిబంధనలు.. ప్రతిపక్షాలకు మాత్రం ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలపై బండి సంజయ్ కరీంనగర్ లో దీక్ష చేస్తే.. వాటర్ కెనాల్ కొట్టడం, గ్యాస్ కట్టర్లతో గేట్లు కట్ చేసి బీభత్సం సృష్టించారని ఈటెల మండిపడ్డారు. ఈ చర్యలు ప్రభుత్వ క్రూరత్వానికి నిదర్శనమని అన్నారు. ఎల్లకాలం ఇది చెల్లదని.. ఈ రోజు అణచి వేయవచ్చు కానీ రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి చేదు అనుభవం తప్పదని ఈటల హెచ్చరించారు.