తెలంగాణ లో అధికార టిఆర్ఎస్ పార్టీ ఆగడాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. కాగా తాజాగా టిఆర్ఎస్ నాయకుల పై పోలీసుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. నిజామాబాద్ జిల్లా ఇస్సాపల్లి లో పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి తో పాటు బీజేపీ నాయకుల పై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
కేసీఆర్ గతంలో పిలుపునిచ్చిన మాదిరిగానే ఈ దాడులు జరుగుతున్నాయని అన్నారు ఈటెల. సూర్యాపేట జిల్లాలో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మీద దాడి చేశారు. ఈ రోజు ఎంపీ అరవింద్ మీద దాడి చేశారని అన్నారు.
పోలీసుల సమక్షంలోనే బీజేపీ నేతలను కత్తితో పొడిచేందుకు ప్రయత్నించారని ఆరోపించారు ఈటల. రాష్ట్రంలో ప్రభుత్వం శాంతి భద్రతలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని అధికార పార్టీ నాయకుల అవినీతి అక్రమాలు నిత్యకృత్యమయ్యాయన్నారు.
దాడులకు పాల్పడుతున్న టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు పట్టించుకోకుండా ఉండడం దారుణమైన విషయమన్నారు. దాడులు టిఆర్ఎస్ కార్యకర్తలు చేస్తే బిజెపి కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం దురదృష్టకర మన్నారు.
దాడులకు పాల్పడ్డ టిఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేసి వెంటనేవారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈటల.