తెలంగాణ ఏర్పడక ముందు కేసీఆర్ ఆస్తులెన్ని.. ఇప్పుడెన్ని అని నిలదీశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రైతులకు ఎక్కడైనా 24 గంటల కరెంట్ వస్తుందా అని ప్రశ్నించారు. ఒకవేళ వస్తుందని బీఆర్ఎస్ నేతలు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్ చేశారు.
రైతుబంధుపై సీలింగ్ ఉండాలన్న ఈటల.. కేసీఆర్ ఒక్కరే రూ.30లక్షల రైతుబంధు తీసుకుంటున్నారని విమర్శించారు. బెంజి కార్లలో తిరిగే వాళ్లకు రైతుబంధు ఎందుకని అడిగారు. 52 శాతం మంది ఉన్న బీసీలకు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నుంచి తాను వెళ్లిపోలేదని.. కేసీఆరే వేళ్లగొట్టారని గుర్తు చేశారు. తమ లాంటి వాళ్లం ఎన్నిసార్లు ఏడ్చామో కేటీఆర్ కి తెలియదా? అని ప్రశ్నించారు.
మోసానికి, ద్రోహానికి మారుపేరు కేసీఆర్ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దయాకర్ రావు నువ్వు చదువుకున్నవా లేదా? అని ప్రశ్నించిన రాజేందర్… అసెంబ్లీకి తనను రానిస్తారో లేదో తెలియదన్నారు. ఎమ్మేల్యేలను అవమానిస్తే శిలాఫలకాలను పగలకొడుతామని చెప్పారు. తన నియోజక వర్గంలో జరిగిన కార్యక్రమానికి తనను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. దమ్ముంటే తాను చెప్పే లెక్కల మీద చర్చకు రావాలని మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు సవాల్ విసిరారు. దేశంలో అందరి కంటే అధ్వాన్నంగా పాలిస్తోంది కేసీఆర్ మాత్రమేనని తీవ్ర ఆరోపణలు చేశారు.
రాష్ట్రం వచ్చే నాటికి జీఎస్డీపీలో అప్పు 15 శాతం ఉంటే.. 2020-21 వరకు దాదాపు 30 శాతం చేరిందని ఆరోపించారు రాజేందర్. 2014లో జీడీపీలో 50 శాతం అప్పు ఉంటే.. 2020-21 లో 48 శాతం మాత్రమే ఉందని చెప్పారు. ఎన్సీడీసీ, నాబార్డు, పీఎఫ్సీల నుండి రుణాలు తీసుకున్నారు కదా.. ఆ సంస్థలు ఎక్కడివని ప్రశ్నించారు. 5 లక్షల కోట్లపైగా తెలంగాణ ప్రభుత్వం అప్పు చేసింది నిజం కాదా? అని నిలదీశారు. తెలంగాణలో ఒక వ్యక్తి సగటు అప్పు లక్ష 25 వేల రూపాయలని అన్నారు.
మోడీ వంద లక్షల కోట్లు అప్పు చేశారని కేటీఆర్, హరీష్ రావు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. దమ్ముంటే తాను చెప్పే లెక్కల మీద చర్చకు రావాలని సవాల్ విసిరారు. తాను విదేశాల్లో, ఇంగ్లీష్ లో చదువుకోకపోవచ్చని, తెలంగాణ ఉద్యమంలో చెప్పినట్టు ఇప్పుడు చెపితే ప్రజలను నమ్ముతారని పగటి కలలు కంటున్నారని అన్నారు.