తల్లి గురించి, తల్లి ప్రేమ, తల్లి బాధ్యత, తల్లి గొప్పతనాన్ని చెప్పడానికి మాటలు.. రాస్తే పుస్తకాలు సరిపోవన్నారు బీజేపీ నేత ఈటల రాజేందర్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు రాజేందర్. బుధవారం మైలార్ దేవ్ పల్లి డివిజన్ లో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కడుపు నొప్పి లేస్తే టాబ్లెట్ దొరకడం లేదు కానీ.. అర్థరాత్రి కూడా మందు సీసా దొరుకుతుందంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ వచ్చిందా? లేదా బాధల తెలంగాణ వచ్చిందా? అని ప్రశ్నించారు. నరేంద్ర మోడీ గారికి కుటుంబం లేదు.. ఈ దేశమే కుటుంబమన్నారు.
మనిషి మిడిమిడి జ్ఞానంతో అప్పుడప్పుడు మాతృమూర్తిని కించపరుస్తూ ఉంటారని చెప్పారు. ప్రపంచంలోనే గొప్ప సాంప్రదాయం, పండుగలు, సంస్కృతి కలిగిన దేశం భారతదేశమన్నారు. భారత్ మాతాకీ జై అంటాం మనం. తెలంగాణ తల్లి విగ్రహాలు, భరతమాత విగ్రహాలు పెట్టుకుంటాం.. మనం పూజించేది ఆ తల్లినే అన్నారు. ఏ దేశంలో అయితే స్త్రీలు పూజించబడతారో, గౌరవించబడతారో ఆ దేశం గొప్పగా ఎదగడం మాత్రమే కాకుండా, సుభిక్షంగా ఉంటుందనేది మనందరి భావన. ప్రపంచంలో వారి వారి దేశాలలో, సంస్కృతిలలో తల్లిని పూజించే కల్చర్ ఉండదు కానీ తల్లిని పూజించే ఏకైక దేశం భారతదేశమే అని తెలిపారు.
ఉగాది పండుగ నుంచి మొదలుపెట్టి అన్ని పండుగలు మహిళల మీదనే ఉంటాయన్నారు. బోనాల పండుగ ప్రతీ గ్రామంలో ప్రతీ గల్లీలో, వాడ వాడలా మనం పూజించే తల్లి అమ్మవారు అని చెప్పారు ఈటల. అలాగే బతుకమ్మ పండుగ అని అంటాము అది కూడా తల్లికి పూజలు చేసినట్టే అన్నారు. దీపావళి, దసరా పండుగలు జరుపుకునేది అధర్మం మీద ధర్మం గెలిచిందని తెలిపారు. 140 కోట్ల మందిని సురక్షితంగా కంటికి రెప్పగా కాపాడుకుంటున్న శక్తి పీఠాలు అన్నీ కూడా మహిళా తల్లులు మాత్రమే అనే విషయం మర్చిపోవద్దన్నారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఉండే కామైక్య దేవి టెంపుల్ ప్రపంచానికే బొడ్రాయిగా వెలసిల్లుతుందని చెప్పారు.
పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు అన్నం తప్ప.. పరమేశ్వరుడు, పార్వతి.. రాముడు సీత అని మాత్రం అనలేదు.. మహిళలకు అంత గొప్ప ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు ఈటల. కుటుంబంలో ఒక భార్య అస్వస్థతకు గురై బెడ్ కి పరిమితమైతే ఆమెకు భర్తలు సేవలు చేయరు. మరొక పెళ్లి చేసుకుంటాడు తప్ప.. భార్యను కంటికి రెప్పలా కాపాడుకున్న ఉదంతాలు చాలా తక్కువన్నారు. కానీ భర్తకు ఏమన్నా అయితే మాత్రం ఆయనే సర్వస్వంగా, పిల్లలే తన ఆస్తిగా భావించి కంటికి రెప్పలా చూసుకునే గొప్ప వ్యక్తులు మన మాతృమూర్తులు అని ఈటల చెప్పారు.
ఏ దేశంలో అయితే స్త్రీ కంటనీరు పెడుతుందో, స్త్రీని అగౌరవ పరుస్తారో.. ఆ దేశం సుభిక్షంగా ఉండే అవకాశం లేదన్నారు. అనేక రూపంలో యాగాలు, పూజలు చేసిన సమాజం చల్లగా ఉండాలని వేడుకుంటున్నామన్నారు. అలాగే చదువుకు సరస్వతి, సంపదకి లక్ష్మీ ఇలా ఏ రూపంలో చూసినా తల్లే మూలంగా జీవిస్తున్న సమాజం భారతీయ సమాజమన్నారు. గ్యాస్ ధర పెరిగిందని చర్చ జరుగుతుంది.. కానీ ప్రపంచ మార్కెట్లో ఎలా ధర పెరిగితే.. అలా ధర పెంచుకోవచ్చని ఈరోజు నిర్ణయం తీసుకోలేదని.. మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు.
స్త్రీల మీద ఆ భారం పడకూడదని వ్యక్తిగతంగా కోరుతున్నానన్నారు. ప్రభుత్వం నడిచేది ప్రజలు కట్టే పన్నుల మీదనే.. మీరు సైకిల్ మోటార్ మీద బయటకు పోయినప్పుడు పోసుకునే ఒక లీటర్ పెట్రోల్ లో రూ.37 పన్ను రాష్ట్రానికి వస్తుందన్న విషయం గమనించాలన్నారు. కేంద్రానికి కట్టేది 19.55 పైసలు మాత్రమే అని తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలు భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే గ్యాస్ మీద పడే భారాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తానన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు మద్యం మీద ఆదాయం రూ.10 వేల కోట్లు.. కానీ కేసీఆర్ పుణ్యమా అని ఈ తొమ్మిది ఏళ్ల తర్వాత మద్యం మీద ఆదాయాన్ని రూ.42 వేల కోట్లకు చేర్చిన ఘనత కేసీఆర్ ది అన్నారు. మహిళలు బెల్ట్ షాపులు తీసివేయాలని డిమాండ్ చేస్తున్నా.. ఎక్కడా మూసి వేయడం లేదన్నారు.
నరేంద్ర మోడీకి కుటుంబం లేదు.. భారత ప్రజలే ఆయన కుటుంబం.. ఆయనకు ఎవరూ లేరు.. ఈ దేశంలో ఆకలి పోవాలని, దరిద్రం పోవాలని, నిరుద్యోగ సమస్య పోవాలని.. దేశం బాగుపడాలి అని నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ అని వెల్లడించారు. తొమ్మిది సంవత్సరాల పాలనలో ఒకరి సొమ్ము తిన్నట్లు గానీ.. ఒకరికి నష్టం చేసినట్టు గానీ లేదన్నారు. ఆయన నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆశీర్వదిస్తే విద్య, వైద్యం సంపూర్ణంగా అందిస్తామన్నారు. ఉద్యోగాలు వచ్చేలా చూస్తామన్నారు. మన పిల్లలు చదువుకుంటున్న రెసిడెన్షియల్ స్కూళ్లలో ఎలాంటి బువ్వ పెడుతున్నారో చూస్తున్నాం. ఆ గతి లేకుండా మంచి భోజనం పెట్టించే బాధ్యత మాది అని తెలిపారు. కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లులు ఇచ్చే బాధ్యత మాది.. పేదవారిని మురికి కూపాల నుంచి బయటపడేసే బాధ్యత మేము తీసుకుంటామన్నారు ఈటల రాజేందర్.