హుజూరాబాద్ ఉప ఎన్నిక కేసీఆర్ దొరతనానికి.. ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటమన్నారు బీజేపీ నేత ఈటల రాజేందర్. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లిలో పర్యటించారాయన. స్థానికులు ఈటలకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరారు. హుజూరాబాద్ ప్రజలను కొనే శక్తి కేసీఆర్, హరీష్ కు కాదు కదా.. వాళ్ల జేజెమ్మ వల్ల కూడా కాదని విమర్శించారు.
టీఆర్ఎస్ లో తన ఎదుగుదలను చూసి ఓర్వలేక కుట్రపన్ని వెళ్లగొట్టారని ఆరోపించారు ఈటల రాజేందర్. హుజూరాబాద్ లో గెలిచేందుకు అన్ని పార్టీల వాళ్లను కొంటున్నారని… అయితే వారితో చేరే వారందరూ అమ్ముడుపోవడం లేదన్నారు. వాళ్ల దగ్గర నటిస్తున్నారని చెప్పారు. పావలావడ్డీ రుణాలు రావాలంటే టీఆర్ఎస్ మీటింగ్ కు రావాలని మహిళలపై ఒత్తిడి చేస్తున్నారని.. హరీష్ రావు మార్కెట్లో వస్తువుల్ని కొన్నట్లు ఆత్మగౌరవాన్ని కొంటున్నారని మండిపడ్డారు.
మధ్యలో వచ్చి వెళ్లిపోయాడంటూ విమర్శలు చేస్తున్న టీఆర్ఎస్ నాయకులకు గట్టి కౌంటరే ఇచ్చారు ఈటల. టీఆర్ఎస్ చరిత్ర 20 ఏళ్లైతే.. 18 ఏళ్లపాటు అందులో తన పాత్ర ఉందన్నారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు డిపాజిట్ దక్కకుండా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్ని డబ్బులు పంచినా.. ధర్మాన్ని గెలిపించాలని కోరారు ఈటల రాజేందర్.