ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజూరాబాద్ బైపోల్ షెడ్యూల్ వచ్చేసింది. అక్టోబర్ 30న పోలింగ్.. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ సందర్భంగా బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పందించారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చిందన్నారు. హుజూరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఈటల.. టీఆర్ఎస్ నేతలను తోడేళ్లతో పోల్చారు. రాజీనామా చేసినప్పటి నుంచి గొర్రెల మందపై తోడేళ్లు పడ్డట్టు తనపై దాడి చేస్తున్నారని విమర్శించారు.
హరీష్ రావు సర్పంచులు, ఎంపీటీసీలను పిలిపించి… తన వెంట ఉన్నవాళ్లను తీసుకురావాలని ఆదేశించినట్లు చెప్పారు రాజేందర్. ఎన్ని బాధలు పెట్టినా చాలామంది భరించి తనతోపాటు ఉన్నారని వివరించారు. 5 నెలలుగా నియోజకవర్గం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని.. పెన్షన్, దళితబంధు రావాలంటే ఇంటిమీద గులాబీ జెండా పెట్టుకోవాలని బెదిరిస్తున్నారని విమర్శించారు.
గ్రామాలను దావత్ లకు అడ్డాలుగా మార్చారని ఆరోపించారు ఈటల. స్వయంగా మంత్రులే టేబుల్స్ వేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని.. టీఆర్ఎస్ వి నీచపు రాజకీయాలంటూ మండిపడ్డారు. గులాబీ నేతలు దొంగ ఓట్ల నమోదుకు కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. దీన్ని అడ్డుకుని తీరతామన్నారు. మిగిలిన చోట్ల చెల్లినట్లుగా టీఆర్ఎస్ కుట్రలు, కుతంత్రాలు హుజూరాబాద్ లో చెల్లవని చెప్పారు ఈటల. బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరన్న ఆయన.. ఇన్నాళ్లూ తనకు అండగా ఉన్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.