రెవెన్యూ శాఖను కేసీఆర్ ఖతం పట్టించారని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర జరిగిన వీఆర్ఏ ధర్నా కార్యక్రమానికి హాజరై మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ తీరు ఎలుకల బాధకు ఇళ్ళు తగులపెట్టిన చందంగా ఉందన్నారు. అవినీతి చేసే అధికారులపై చర్యలు తీసుకోవాలి తప్ప మొత్తం వ్యవస్థనే రద్దు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. పోలీసులు, అణచివేత ఉద్యమాలను ఆపలేవని.. ఉద్యోగులతో పెట్టుకుంటే బతికి బట్టకట్టరని హెచ్చరించారు.
కేసీఆర్ ప్రధాని అవ్వండి.. ఇంకా ఏమన్నా అవ్వండి.. ముందు రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈటల. కేసీఆర్ తీరు కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీయడానికి పోయినట్టే ఉందని ఎద్దేవ చేశారు. ఏడున్నర సంవత్సరాలుగా కేసీఆర్ ప్రజలను కలిసారా? ప్రజా దర్బార్ నిర్వహించారా? అని ప్రశ్నించారు. ప్రగతి భవన్ అని పేరు పెట్టుకున్నారే గానీ.. ఆ ప్రగతి అంతా ఆయన కుటుంబానికి మాత్రమే దక్కిందని సెటైర్లు వేశారు.
చాలా రోజుల తర్వాత ఇందిరాపార్క్ దగ్గర ఇంత పెద్ద ధర్నా చేయడం చూస్తున్నానన్న ఈటల.. నిర్బంధాలను ఎదిరించి సంఘటితమైన వీఆర్ఏలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ”2017 ఫిబ్రవరి 24 శివరాత్రి రోజున కేసీఆర్ చెప్పిన మాటలు నమ్మి ఆయనకు మీరంతా పాలాభిషేకం చేశారు.. సీఎం మాట అంటే అది ఒక జీవో కావాలి.. కానీ కేసీఆర్ మాటలు ఉత్తవే అయ్యాయి. విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ పోస్టులకు ప్రమోషన్ ఉంటుందని భావించి, పీహెచ్డీ చేసిన వాళ్లు, పీజీ చేసినవాళ్లు కూడా పరీక్షలు రాసి ఎంపికయ్యారు. ప్రమోషన్ వస్తే జాయింట్ కలెక్టర్ దాకా వెళ్దాం అనుకున్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉండి గౌరవించడే పోస్ట్ అని భావించారు. కానీ వారి ఆశ అడియాస అయింది. వారి కళ్ళలో కేసీఆర్ మట్టి కొట్టారు” అని మండిపడ్డారు.
కేసీఆర్ చేసిన పనికి అధికారుల మీద పెట్రోల్ పోసి దాడి చేసే పరిస్థితి వచ్చిందన్నారు ఈటల. అందరి కళ్ళల్లో మట్టికొట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ సర్కారేనని ఆరోపించారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల చైతన్యం చూశామని.. విజయవాడ భగ్గుమందని గుర్తు చేశారు. కానీ.. తెలంగాణలో ఆ స్వేచ్ఛ లేదన్నారు. ధర్నా అని పిలుపు ఇవ్వగానే రాత్రికి రాత్రే అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ కు అధికారం ఇచ్చింది 2023 వరకేనని.. ధనిక రాష్ట్రంలో డబ్బులు ఎవరికీ పోయాయని ప్రశ్నించారు. వీఆర్ఏలు ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధాన కర్తలని.. వారి డిమాండ్స్ అన్నీ తీర్చాలన్నారు ఈటల రాజేందర్.