ఈటల రాజేందర్ అక్రమాలకు పాల్పడ్డారు.. అందుకే బర్తరఫ్ చేశామనేది టీఆర్ఎస్ వెర్షన్.. లేదు లేదు.. పార్టీలో ఆయన క్రేజ్ పెరుగుతోంది.. కేసీఆర్ గ్రాఫ్ డౌన్ అవుతోంది.. అందుకే కక్ష గట్టి గెంటేశారనేది రాజేందర్ వర్గం వాదన. ఎవరి మాటలు వారివే.. కానీ.. నిజం దాగదు కదా.. ఏదో ఓనాడు బయటపడుతుంది. తాజాగా ఓ కార్యక్రమంలో కనిపించిన సీన్ టీఆర్ఎస్ వర్గాలకు కర్రు కాల్చి వాత పెట్టినట్లే అయింది. హుజూరాబాద్ లో విజయం తర్వాత ఈటల క్రేజ్ రెండింతలు పెరిగింది. ఇది గులాబీ శ్రేణులను మినహాయించి ఎవరిని అడిగినా అదే చెబుతున్నారు. కొందరు గులాబీల మదిలోనూ అదే ఉంటుంది కానీ బయటపడరు. పార్టీలకు అతీతంగా ఈటల క్రేజ్ ఏంటో మరోసారి బయటపడింది.
కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడి వివాహం హైదరాబాద్ నోవోటల్ లో ఘనంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు చాలామంది హజరయ్యారు. అయితే ఈటల రాజేందర్ కు అక్కడున్నవారు నీరాజనాలు పలికారు. సెల్ఫీలకు ఎగబడ్డారు. సరిగ్గా అప్పుడే మంత్రి కేటీఆర్ వచ్చారు. సెల్ఫీల కోసం జనం ఈటలను చుట్టుముట్టడం చూశారు. తనను ఎవరూ పలకరించకపోవడంతో దిగాలుగా సైడ్ అయ్యారు.
ఒకప్పుడు సెల్ఫీలకు కేరాఫ్ అడ్రస్ కేటీఆర్ అని చెప్పుకునేవారు. ఎక్కడ ఏ కార్యక్రమానికి వెళ్లినా ఎగబడి సెల్ఫీలు తీసుకునేవారు జనాలు. కానీ.. సీన్ మారింది. కల్వకుంట్ల కుటుంబానికి ఖతర్నాక్ ఝలక్ ఇచ్చారు ప్రజలు. కేటీఆర్ ను పట్టించుకోకుండా ఈటల చుట్టూ మూగారు. దీంతో ఫ్రస్ట్రేషన్ లో పక్కకు తప్పుకుని వెళ్లిపోయారు ఆయన. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈటల క్రేజ్ ముందు చిన్నసారు చిన్నబోయారు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రాజేందర్ కు జరిగిన అవమానం కంటే ఇదేం పెద్దది కాదులే అని మరికొందరు అంటున్నారు.