హుజూరాబాద్ ఉప ఎన్నిక మూడున్నర కోట్ల మంది ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తుందని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. హన్మకొండ కమలాపూర్ లో ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టారాయన. మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సహా ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ఈటల రాజేందర్ ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఆయన గెలుపుతో గజ్వేల్ లో కేసీఆర్, సిరిసిల్లలో కేటీఆర్, సిద్దిపేటలో హరీష్ రావు ఓడిపోయి.. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం మోడీ లక్ష కోట్లు ఖర్చు చేస్తుంటే.. కేసీఆర్ మాత్రం హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు కిషన్ రెడ్డి. ఈటల రాజేందర్ ఒక్కడే ఒక సైన్యమంటూ కొనియాడారు.
ఇక ఈటల మాట్లాడుతూ… రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని విమర్శించారు. కేసీఆర్ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడతారని.. అందుకు సంకేతమే హుజూరాబాద్ ఉప ఎన్నిక అని చెప్పుకొచ్చారు ఈటల. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా దక్కవంటూ సెటైర్లు వేశారు.