దళిత బంధు పథకాన్ని రాష్ట్రమంతా అమలు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. హుజూరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉప ఎన్నికలో గెలిచేందుకు కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలతో ఆయన స్థాయి దిగజారుతోందని విమర్శించారు. అలాగే సొంత పార్టీ నేతలనే కొనుగోలు చేసిన చరిత్ర కేసీఆర్ దని సెటైర్లు వేశారు.
దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ మాట నిలబెట్టుకోలేదని గుర్తుచేశారు ఈటల రాజేందర్. మంత్రివర్గంలో కూడా దళితులకు అన్యాయం చేశారని అన్నారు. సీఎంవో ఆఫీసులో ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉన్నతాధికారైనా ఉన్నారా అని ప్రశ్నించారు. తన రాజీనామాతో నియోజకవర్గ ప్రజలకు మేలు జరుగుతోందని.. ఇలాగైనా కేసీఆర్ వారికి సంక్షేమ పథకాలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు.
కేసీఆర్ స్థాయి పడిపోయిందని చెప్పడానికి మండలస్థాయిలో నిర్వహించిన సభే నిదర్శనమని.. నియోజకవర్గంలో మోహరించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇంటెలిజెన్స్ ను వాపస్ తీసుకుంటే టీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా రాదని చురకలంటించారు ఈటల రాజేందర్.