- టీఆర్ఎస్ ను ఎదుర్కొనే వ్యూహమేంటి..?
తెలంగాణలో అధికారమే బిజెపి టార్గెట్ గా పెట్టుకుంది. ఇందులో భాగంగానే అమిత్ షా వ్యూహాలు అమలు కాబోతున్నాయా..? ఇప్పటికే షా టీమ్స్ తెలంగాణను ఆవరించాయా..? అధికారాన్ని ఒడిసిపట్టుకునే నేతల భాగస్వామ్యం చేసుకోవడమే మిగిలిందా..? మరి..! ఈటల హుటాహుటిన హస్తిన బాట ఎందుకు పట్టారు..? రాజకీయ చాణక్యుడితో ఎందుకు భేటీ అయ్యారు..? ఈటలకు జాతీయ స్థాయిలో కొత్త బాధ్యతలు అప్పగించనున్నారా..? బిజెపిలో ఈటల క్రియాశీలకంగా మారనున్నారా..? తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకునే దిశగా కదులుతున్న బిజెపి.. పార్టీని మరింత పటిష్టపరిచేలా పునాది విస్తరింపజేస్తోంది. సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరి హుజూరాబాద్ ఉప ఎన్నికలో అద్భుత విజయం సాధించినప్పటికీ.. బిజెపిలో ఈటల రాజేందర్ కు సరైన ప్రాధాన్యం దక్కడంలేదని కొంతకాలంగా వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో హైకమాండ్ ఈటలను ఢిల్లీకి పిలిపించి మంతనాలు జరిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం నాడు ఈటలను ఇంటికి పిలిపించుకొని ప్రత్యేకంగా మాట్లాడారు. దాదాపు 30 నిమిషాల పాటు చర్చించారు. ఈ భేటీ రాష్ట్రంలో ఆసక్తికర చర్చకు దారితీసింది.
ఢిల్లీలో అమిత్ షాతో జరిగిన భేటీలో ఈటలకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. తెలంగాణలో బలమైన నేతగా ఉన్న రాజేందర్ ను గులాబీ కోటను ఢీకొట్టే పోరులో భాగంగానే ఈ చర్యలు చేపట్టిందని తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ ప్రచార బాధ్యతలు అప్పగించనున్నారనే టాక్ వినపడుతోంది. హైదరాబాద్ లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందే ఈటలకు పదవిపై ప్రకటన వస్తుందని సమాచారం. దీంతో తెలంగాణ బిజెపిలో రాజేందర్ క్రియాశీలకంగా మారడమే కాకుండా.. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు మరో అస్త్రం లభించినట్లవుతుంది.
ఈటలకు కీలక పదవి ఇవ్వడం వెనుక అమిత్ షా భారీ వ్యూహమే ఉందని తెలుస్తోంది. గత రెండేళ్లుగా తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి ఈటల, ఏనుగు రవీందర్ రెడ్డి సహా పలువురు నేతలు బిజెపిలో చేరారు. అయితే బిజెపిలో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు గౌరవం లేదని.. పదవులు కూడా రాడవం లేదనే ప్రచారం జరుగుతోంది. సీనియర్లకు గుర్తింపు లేదని… వాళ్లంతా అసంతృప్తిలో ఉన్నారనే చర్చ సాగుతోంది. ఇప్పుడు ఈటలకు పదవి ఇస్తే.. పార్టీలోకి మళ్లీ వలసలు ఊపందుకుంటాయని బిజెపి అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో బలమైన బీసీ నేతగా ఈటల రాజేందర్ ఉన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఓ సామాజిక వర్గానికే పెద్దపీట అనే ప్రచారం ఉంది. దీంతో బీసీ కార్డుతో ఎన్నికలకు వెళ్లారని బీజేపీ హైకమాండ్ ప్లాన్ చేస్తుందని విశ్లేషకులు చెబుతున్న మాట. బీసీ వర్గానికే చెందిన బండి సంజయ్ పార్టీ చీఫ్ గా ఉండగా.. ప్రచార కమిటి చైర్మెన్ గా ఈటలను నియమిస్తే బీసీల్లో పార్టీకి మరింత పట్టు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే ఆలోచనలో భాగంగా బీసీ కార్డుతో లక్ష్మణ్ ను పెద్దల సభకు పంపారని చెబుతున్నారు. మొత్తానికి ఈటల రాజేందర్ కు కీలక పదవి కట్టబెట్టి.. కేసీఆర్ తో తుదిపోరుకు బాటలు వేయనున్నట్లు తెలుస్తోంది.