ఇన్నాళ్లు వెనకుండి చక్రం తిప్పిన మంత్రి హరీష్ రావు.. హుజూరాబాద్ లోకి ఎట్టకేలకు ఎంట్రీ ఇచ్చారు. ఈటల టార్గెట్ గా విమర్శల దాడి చేస్తున్నారు. ప్రధానంగా ఈటల ఒక్కడే అభివృద్ధి చెందితే ఆత్మగౌరవం అవుతుందా..? అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్క హరీష్ కే కాకుండా.. టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసురుతూ కేసీఆర్, హరీష్ కు ఈటల బహిరంగ లేఖ రాయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా తనపై వారు చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టాలనేది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. ఆ చర్చ కూడా హుజూరాబాద్ వేదికగా ప్రజలు, మీడియా సమక్షంలో జరగాలని ఈటల కోరుకుంటున్నట్లు లేఖలో ప్రస్తావిస్తారని సమాచారం.
విమర్శలు, ఆరోపణలతో ప్రజల్లో గందరగోళం సృష్టించే బదులు.. బహిరంగ చర్చకు నేను సిద్ధం.. మీరు కూడా వస్తారా..? అని ఈటల లేఖలో రాయనున్నట్లు ఆయన అభిమానులు చెబుతున్నారు. సభల్లో తనపై ఆరోపణలు చేసే బదులు ప్రజల సమక్షంలోనే అడిగితే వాటికి సమాధానం చెబుతారని.. అలాగే ఆయన మీపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపిస్తారని అంటున్నారు. అలాకాకుండా రోజూ సభల్లో తిట్టుకొని టైమ్ వేస్ట్ చేసుకోవడం ఎందుకని.. దీనివల్ల ప్రజల్లో కూడా అనవసరమైన గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందుకే బహిరంగ చర్చ ద్వారా ప్రజాస్వామ్య పద్దతుల్లో చర్చ జరిగితే మంచి రాజకీయాలకు పునాదులు వేసినట్లు అవుతుందని.. కొత్త సంప్రదాయానికి తెరలేపిన వాళ్ళం అవుతామని ఈటల తన లేఖలో ప్రస్తావించనున్నట్లుగా వివరిస్తున్నారు.
ఈ బహిరంగ చర్చతో గెలుపు ఓటములు కూడా తేలిపోతాయని ఈటల అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. సవాళ్లు, ప్రతి సవాళ్లు ఒకరిపై ఒకరు రెచ్చగొట్టుకునే ఉపన్యాసాలు అవసరం లేదని.. అంతే కాకుండా అనవసరమైన హామీలు ఇవ్వడం, డబ్బు పంచడంతో పని లేకుండా పోతుందని… అందుకే పెద్ద మనసుతో కేసీఆర్, హరీష్ బహిరంగ చర్చకు రావాలని ఈటల కోరుకుంటున్నట్లు చెబుతున్నారు ఆయన ఫ్యాన్స్. ఈ చర్చలో ప్రస్తావించాల్సిన విషయాలను కూడా ఈటల లేఖలో వివరిస్తారని అంటున్నారు.
ఈటల లేఖలో ప్రస్తావించే విషయాలు..!
1. నేను దళితుల భూములు గుంజుకున్నట్లు మీరు పదే పదే చేస్తున్న, చేయిస్తున్న… మీరు ప్రోత్సహించి నాపై ఫిర్యాదు ఇప్పించిన అంశంపై ప్రజల సమక్షంలో చర్చకు నేను సిద్ధం. ప్రభుత్వ పరంగా మీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ తెచ్చి చూపిస్తారా..?
2. నేను అక్రమ మార్గంలో ఆస్తులను కూడగట్టుకున్నట్లు.. మీరు చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ప్రజల ముందు ఉంచాలని కోరుకుంటున్నా.
3. మీరు చెబుతున్నట్లు నేను సంక్షేమ పథకాలను, రైతు బంధును వ్యతిరేకించింది నిజమే అయితే.. దానికి సంబంధించిన ఆధారాలతో ప్రజల ముందుకు రావాలని కోరుకుంటున్నా.
4. కేసీఆర్ కు నేను ద్రోహం చేసినట్లు.. కుట్ర పన్నినట్లు మీ దగ్గర ఉన్న ఆధారాలతో చర్చకు రండి.
5. మంత్రివర్గంలో ఉంటూనే నేను ప్రభుత్వాన్ని విమర్శించినట్లు చేస్తున్నఆరోపణలపై ఆధారాలతో రావాలని కోరుకుంటున్నా.
6. నాకు కోట్ల రూపాయల లాభం జరిగే కాంట్రాక్టులు ఇచ్చినట్లు, నా భూమిని రెగ్యులరైజ్ చేసి కోట్ల రూపాయలు లాభం చేసినట్లు చేస్తున్న ప్రచారంపై కూడా ఆధారాలు చూపించాలి.
7. నేను పార్టీకి, ప్రభుత్వానికి చేసిన మోసం ఏంటో రుజువు చేయాలి.
8. 2018 ఎన్నికల్లో నన్ను ఓడించాలని మీరు చేసిన కుట్రకు సంబంధించిన ఆధారాలను నేను చూపిస్తా.
9. 2014కు ముందు నాకున్న ఆస్తులు.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నా ఆస్తుల పెరుగుదలపైన బహిరంగ చర్చలో ఆధారాలతో సహా చూపిస్తా. మీరు కూడా 2014కు ముందు మీ ఆస్తులు.. ఇప్పుడు మీకున్న ఆస్తుల వివరాలను చూపించాలి.
10. నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధిపై ఆధారాలతో సహా నిరూపిస్తా. నా హయాంలో అభివృద్ధి జరగలేదని మీ దగ్గర వున్న వివరాలను బహిరంగ చర్చలో చూపించాలి.
11. కేసీఆర్ బొమ్మ పెట్టుకొని నేను గెలిచానని మీరు అంటున్నారు.. అదే నిజమైతే కవిత, వినోద్ రావులు ఎందుకు ఓడిపోయారో ప్రజల సమక్షంలో చెప్పాలి.
12. హుజూరాబాద్ లో ఇంత పెద్ద ఎత్తున నాయకులను, మంత్రులను, ఎమ్మెల్యేలను దించుతున్నారు. డబ్బుతో ఎందుకు ప్రలోభాలకు గురిచేస్తున్నారో ప్రజల సమక్షంలో చెప్పాలి.
13. ఒక్క హుజూరాబాద్ లోనే దళిత బంధు ఎందుకు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఇవ్వని మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇక్కడే ఎందుకు ఇస్తున్నారో చెప్పాలి.
14. గతంలో ఎన్నడూ, ఎక్కడాలేని విధంగా హుజూరాబాద్ లో పెద్ద ఎత్తున నిధులను విడుదల చేయడంలో ఆంతర్యం ఏంటి..? ఇప్పుడే గొర్రెల పంపిణీ, కొత్త రేషన్ కార్డుల మంజూరు, కొత్త పెన్షన్లు, 58ఏళ్లు నిండిన వారికి పింఛన్ ఇవ్వాలనే నిర్ణయం వెనుక ఉద్దేశం ఏంటో కూడా ప్రజల సమక్షంలో చర్చిస్తే బాగుంటుంది.
15. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేకపోయారో ప్రజలకు చెబితే బాగుంటుంది.
16. మాట మీద నిలబడే మీరు గతంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేకపోయారో ప్రజల సమక్షంలో చర్చించాలని కోరుకుంటున్నా.
ఇలా అనేక విషయాలను ప్రస్తావిస్తూ.. కేసీఆర్, హరీష్ రావును బహిరంగ చర్చకు ఆహ్వానిస్తూ.. ఈటల లేఖ రాయాలని భావిస్తున్నట్లుగా సమాచారం.