సీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై మరోసారి మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. పెద్దపల్లిలో పెద్దమ్మ తల్లి దేవాలయం ప్రారంభోత్సవనికి ఆయన హాజరయ్యారు. వరదలకు వందల గ్రామాలు నీటిలో మునిగిపోయాయని చెప్పారు. ప్రజలు ఇళ్లలో వస్తువులన్నీ కొట్టుకుపోయాయి అవస్థలు పడుతున్నారని వివరించారు. ముంపు గ్రమాల్లో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
వర్షం ఎవరో కురిపించారని కేసీఆర్ చెప్పడం ఎంతో బాధగా ఉందన్నారు రాజేందర్. ఎవరో పగ బట్టి ఇక్కడ కురిపించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఒకప్పుడు వర్షాల కోసం పూజలు చేసేవారని.. గంగమ్మ కనికరించి కురిస్తే తప్ప వానలు రావని స్పష్టం చేశారు. అంతేగాని ఎవడో బయటవాడు వచ్చి ఇక్కడ వర్షాలు కురిపించడం ఏంటని.. ఇవన్నీ అర్థం లేని వ్యాఖ్యలని విమర్శించారు.
సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతారా? అని ప్రశ్నించారు ఈటల. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి హయాంలో వర్షాలు కురిపించేందుకు క్లౌడ్ సీడింగ్ కు ప్రయత్నిస్తే.. వందల కోట్ల రూపాయలు వృధా అయ్యాయి తప్ప ఎక్కడా వానలు పడలేదని గుర్తు చేశారు. ప్రకృతిని నియంత్రించే శక్తి ఎవడికీ లేదని అన్నారు.
వరదలతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు సర్వం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మాటలు చెప్పకుండా, బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇళ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూం నిర్మించి ఇవ్వాలని.. పరిహారం ఇచ్చి సాయంగా నిలవాలన్నారు ఈటల రాజేందర్.