ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ బ్లాస్ట్ అయ్యారు. హుజూరాబాద్‌లో పోలీసుల నిర్బంధం, చీకటి రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. ప్రోటోకాల్ లేకపోయినా వేరే ప్రాంత ఎమ్మెల్యేలు హుజురాబాద్‌లో పనులకు శంకుస్థాపన ఎలా చేస్తారని ప్రశ్నించారు. హుజూరాబాద్ ప్రజలమీద గులాబీ నేతలు తోడేళ్లలాగా విరుచుకుపడుతున్నారని విమర్శించారు.
ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు టీం హుజరాబాద్‌లో ఇంటింటికీ వెళ్లి బెదిరింపులకు దిగుతోందని ఈటల ఆరోపించారు. టీఆర్ఎస్‌కే ఓటు వేస్తేనే దళిత బంధు ఇస్తామని.. గులాబీ కండువా కప్పుకుంటేనే రూ. 10 లక్షలు వస్తాయని, టీఆర్ఎస్ జెండా ఇంటిమీద కడితేనే పథకం వర్తిస్తుందని మభ్యపెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బు ఆయన తాత సంపాదించినదో లేక కేసీఆరే కూలీ పనిచేసో ఇవ్వడం లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు ఈటల. హుజురాబాద్‌లో పోలీసుల, అధికారుల పని తీరుమీద, వారు అమలు చేస్తున్న నిర్బంధం మీద నివేదిక తయారు చేసి కేంద్ర హోం మంత్రికి పంపించామని, హెచ్చార్సీ, హైకోర్టులను కూడా ఆశ్రయిస్తామని చెప్పారు.
బీజేపీ నేతలపై, చైతన్యవంతంగా మాట్లాడుతున్న వారిపై అకారణంగా పోలీసులు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు ఈటల. తమ నాయకుల ఫోన్లను టాప్ చేస్తున్నారని ఆరోపించారు.అధికారులు చట్టబద్ధంగా పని చేయకపోతే శిక్ష తప్పదని… తదుపరి పరిమాణాలకు వారే బాధ్యులవుతారని హెచ్చరించారు. కేసీఆర్ వస్తున్నారని బీజేపి నేతలని, ప్రశ్నించే వారందరినీ అరెస్ట్ చేస్తున్నారన్న ఈటల.. ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. తీసుకెళ్లిన వారికి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. తమ ఓపికను బలహీనతగా భావించొద్దని హెచ్చరించారు. బేషరతుగా వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
దళితబంధుని స్వాగతిస్తున్నామని ఎప్పుడో చెప్పామని గుర్తు చేసిన ఈటల.. అందరికీ ఇవ్వాలనే తమ డిమాండ్ అని చెప్పారు. దళిత బంధకు ఇప్పటివరకూ ఇంకా విధి విధానాలు లేవని విమర్శించారు. డబ్బులు ఉన్నవారికి.. ఉద్యోగాలు చేసే వారికి.. తమకు నచ్చిన వారికి మాత్రమే దళిత బంధు ఇచ్చుకుంటున్నారని ఈటల ఆరోపించారు. తనని ఓడించడానికే దళితబంధు అన్న విషయాన్ని ప్రజలు గుర్తించారని చెప్పుకొచ్చారు. హుజూరాబాద్ ప్రజలు బానిసలు కాదని.. కథానాయకులు అని అభివర్ణించారు. హుజరాబాద్ ప్రజలు.. కేసీఆర్ తాత్కాలిక ప్రేమను చూసి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి.. కానీ దానికి కారణమైన ఈటలని మరచిపోవద్దని కోరారు.