హుజూరాబాద్ పోరు ఎప్పుడో తెలియదు గానీ.. టీఆర్ఎస్, బీజేపీ మధ్య డైలాగ్ వార్ మాత్రం పీక్స్ లో నడుస్తోంది. ముఖ్యంగా హరీష్ రావు, ఈటల రాజేందర్ మధ్య డైలాగ్ వార్ మామూలుగా లేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈటల ఏం చేశారని అంటూనే ఘాటైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు హరీష్. తానేమన్నా తక్కువా అంటూ ఈటల కూడా స్ట్రాంగ్ కౌంటర్సే ఇస్తున్నారు. ఈ క్రమంలోనే బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్యతో ఆయన భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. హుజూరాబాద్ పోరులో మరింత హీట్ పెంచింది.
భేటీ అనంతరం మాట్లాడిన ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని.. ఉద్యమం నుంచి వచ్చానని అన్నారు. విద్యార్థి ఉద్యమాల్లో ఆర్ కృష్ణయ్యతో కలిసి తిరిగానని చెప్పారు. ప్రగతిభవన్ అధికార దుర్వినియోగ కేంద్రంగా మారిందని విమర్శించారు. ఒక్క బైపోల్ లో గెలిచేందుకే టీఆర్ఎస్ వందల కోట్లు ఖర్చు పెడుతోందని.. దొడ్డిదారిలో భయపెట్టాలని చూస్తే భయపడే వారెవరూ లేరని కౌంటర్ ఇచ్చారు.
ట్రబుల్ షూటర్, ఎన్నికల వ్యూహకర్త అని చెప్పుకునే హరీష్ రావు చేస్తున్నవన్నీ మోసాలేనని విమర్శించారు ఈటల. దానికి ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు. హుజూరాబాద్ లో హరీష్ చేస్తున్నవన్నీ మోసాలు, అబద్ధాలేనని ఆరోపించారు. కేసీఆర్ అహంకారానికి, ధర్మానికి మధ్య పోరాటం జరుగుతోందని చెప్పారు. అక్రమార్కులకు ప్రజల మద్దతు ఉండదని… ఆర్ కృష్ణయ్యను మర్యాద పూర్వకంగా కలిశానని వివరించారు. తనకు అండగా ఉండాలని కోరినట్లు చెప్పుకొచ్చారు ఈటల రాజేందర్.