హుజురాబాద్ ఉపఎన్నిక తొలి రోజు ప్రచారంలో మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలపై బీజేపీ అభ్యర్థి ఈటల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ధర్మానికి, న్యాయానికి విరుద్ధంగా పని చేస్తే.. హరీష్ రావుకు కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తే.. చరిత్ర క్షమించదని హితవు పలికారు.
హరీష్ రావు ఎంత కష్టపడినా కేసీఆర్ నమ్మరని చెప్పారు. ఏనాటికైనా టీఆర్ఎస్‌ను చేతిలోకి తీసుకుందామని హరీష్ ఆశపడుతున్నారని ఆరోపించిన ఈటల.. కేసీఆర్ బతికుండగానే ఆ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు. హరీష్‌ను ఎవరూ నమ్మరని.. ఆయన చేతికి వచ్చేలోపే ఆ పార్టీ ఖతమవుతుందని అభిప్రాయపడ్డారు.
చిల్లర ఆరోపణలు, చౌక బారు ప్రచారాలు చేయవద్దని.. చేసి పలుచన కావొద్దని ఈటల హరీష్‌రావుకు హితవు పలికారు. ” 18 సంవత్సరాల అనుబంధం మనది. అవన్నీ మర్చిపోయి మీ మామ దగ్గర మార్కులు సంపాదించడానికి ఇవన్నీ చేయకు. మీ మోసపూరిత మాటలను హుజూరాబాద్ ప్రజలు నమ్మరు. దుబ్బాకలాగే కర్రు కాల్చి వాత పెడతారు” అని హెచ్చరించారు.
ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయ్యావు. మీ మామ నియోజకవర్గంలో నువ్వు వరుసగా గెలుస్తున్నావు.. కానీ నేను ఒక్క అవకాశం ఇస్తే వరుసగా గెలుస్తున్నా ప్రజల ప్రేమను పొందుతున్నాను. హుజూరాబాద్‌లో అభివృద్ది జరగలేదు అంటున్నారు. నువ్వు తిరిగిన 4 లైన్ల రోడ్డు వేయించింది నేనే. అభివృద్ది విషయంలో మీకు ఎంత సోయి ఉందో నాకు అంతే ఉంది అని చెప్పుకొచ్చారు ఈటల.
తనతో పాటు టీఆర్ఎస్‌లో 11 మంది ఎమ్మెల్యేలను ఓడించడానికి కేసీఆర్.. ప్రతిపక్షనేతలకు డబ్బులు ఇచ్చారని ఆరోపించారు ఈటల. రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లన్నీ ట్యాప్ అవుతున్నాయని చెప్పారు. 17 శాతం మంది జనాభా ఉన్న ఎస్సీలకు ఎన్ని మంత్రులు ఇచ్చారని ప్రశ్నించిన ఆయన.. అందులో పావు శాతం కూడా లేని వెలమలకు ఎన్ని పదవులు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు.
2016లో మూడు సార్లు ప్రగతి భవన్ గేట్ల దగ్గర నేతలను ఆపారని.. అప్పటి నుంచే బానిస బతుకులు మొదలయ్యాయని ఈటల విమర్శించారు. కేసీఆర్‌కు అహంకారం అని ఆరోజున మాట్లాడిన మంత్రి గంగుల.. ఇప్పుడు హుజురాబాద్ వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రగతి భవన్ కాదు.. బానిస భవన్ అని పెట్టుకో అని కేసీఆర్‌కు ట్యాబెట్లు ఇచ్చే ఎంపీ సంతోష్ రావుకు ఆనాడే చెప్పానని గుర్తు చేసుకున్నారు. వందల కోట్ల రూపాయలతో ప్రజలను కొనడానికి పునాది వేసిన వారిగా కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచి పోతుందని ఎద్దేవా చేశారు.
“ తెలంగాణ ఏర్పడిన తరువాత హుజూరాబాద్ నియోజకవర్గ రూపురేఖలు మార్చాను .18 చెక్ డ్యామ్‌లు కట్టించాను. రూ.1,050 కోట్లతో ఎస్సార్ఎస్పీ కాలువలు బాగు చేయించాను. హుజూరాబాద్, జమ్మికుంటకు ఒక్కో పట్టణానికి రూ.40 కోట్లు మంజూరు చేస్తే.. డబ్బులు ఇవ్వకుండా నిలిపివేసింది KTR. మళ్లీ అవే డబ్బులను ఇప్పుడు మంజూరు చేసి తప్పుదోవ పట్టిస్తున్నారు” అని ఆరోపించారు ఈటల.