తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే స్వీట్ వార్నింగ్‌ను కార్పొరేట్ ఆస్పత్రులు లైట్ తీసుకుంటున్నాయి. కరోనా చికిత్సకు అధిక బిల్లులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ కేసీఆర్ సర్కార్ చేసిన ప్రకటనలు.. ప్రైవేట్ హాస్పిటళ్లకు పెద్దగా చెవులకెక్కడం లేదు. నిన్నా మొన్నటి వరకు కరోనా పేరు చెప్పి దోచుకున్న సంగతులు విన్నాం.. ఇప్పుడు ఏ రోగంతో ఆస్పత్రికి వచ్చినా కరోనా పేరు చెప్పి లక్షల రూపాయలు దండుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.
తాజాగా సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో ఇదే తరహా దోపిడి వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ఓ యుకువడు ఇటీవల కిడ్నీ వ్యాధితో యశోద హాస్పిటల్ లో చేరగా.. అతని కుటుంబ సభ్యులకు ఆస్పత్రి యాజమాన్యం చుక్కలు చూపిస్తోంది.
ట్రీట్‌మెంట్ పేరుతో ఇప్పటికే 4 లక్షల రూపాలయ వరకు వసూలు చేసి.. ఇప్పుడు కొత్తగా కరోనా వచ్చిందంటూ మరో 5 లక్షలు చెల్లించాలంటూ ఆర్డర్ వేసింది. అప్పటివరకు బాధితుడని చూపించేది లేదంటూ హుకూం జారీ చేసింది. దీంతో ఏం చేయాలో తెలియని యువకుడి తల్లి.. ఆస్పత్రి ఎదుట బోరున విలపిస్తోంది. ఎంత వేడుకున్నా.. తన కుమారుడిని చూపించకపోవడంతో అసలు బతికే ఉన్నాడా లేక చనిపోయాడా తెలియడం లేదని విలవిలలాడుతోంది. తన దగ్గరున్న డబ్బులన్నీ ఇప్పటికే ఆస్పత్రికి కట్టేశానని.. ఇప్పుడేం తనకు దిక్కెవరు అంటూ కన్నీరు మున్నీరువుతోంది.