డిసెంబర్ 23 కల్లా సీఎం కేసీఆర్ కు కర్రు కాల్చి వాతపెట్టినట్లు బుద్ది చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మల్యాల మండల కేంద్రంలో కొత్తపేట వద్ద నిర్వహించిన ప్రజాఘోష- బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తన 20 ఏండ్ల అనుభవంలో శాసనసభలో బడ్జెట్ సమావేశాలు 41 రోజులు జరగితే అందులో 30 రోజులు వర్కింగ్ డేస్ ఉండేవని ఆయన పేర్కొన్నారు. ఏ విధమైన బడ్జెట్‌కు ఎంత కేటాయించాలి అనే అంశంపై రాత్రి వరకు చర్చించి నిర్ణయం తీసుకుంటే గానీ ఆమోదం పొందేది కాదన్నారు.
ఇందిరా పార్కు వద్ద పెద్దపెద్ద టెంట్లు వేసుకుని రైతుల, వీఆర్ఏల, మహిళా సంఘాల సమస్యలపై గానీ నిరసన కారులు నిరసన తెలుపుతూ శాసనసభలో మాట్లాడాలని కోరేదన్నారు. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక టెంట్లు వేసుకోవడానికి, సభలు నిర్వహించడానికి, ధర్నాలు చేసేందుకు అనుమతులు లేవన్నారు.
యువతకు ఉద్యోగాలు ఇస్తామంటూ గద్దెనెక్కిన పార్టీ ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వక పోగా మేనిఫెస్టోలో ప్రస్తావించిన నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వట్లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాళేశ్వరం పంప్ హౌస్ పంపుల వల్ల కరెంట్ బిల్లు తప్ప లాభమేమీ లేదని ఆయన ఆరోపించారు.