ప్రజలని మభ్యపెట్టేవారు మాత్రమే కాదు. నిజాలని నిర్భయంగా మాట్లాడే నేతలు కూడా టీఆర్ఎస్‌లో ఉన్నారు. ఆ జాబితాలో ముందు వరుసలో ఉండే పేరు మంత్రి ఈటెల రాజేందర్‌ది. పార్టీలో అందరు నేతల్లా కేసీఆర్ చెప్పిందే వేదం అని పాటించకుండా.. తప్పొప్పులు ఎత్తిచూపేందుకు కొన్నిసార్లు ఏ మాత్రం ఆయన వెనుకాడరు. తాజాగా మరోసారి పరోక్షంగా కేసీఆర్ నిర్ణయాలను తప్పుబట్టారు.
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూర్‌లో రైతు వేదిక ప్రారంభోత్సవం సందర్భంగా ఈటెల కీలక వ్యాఖ్యలు చేశారు. కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తామన్న కేసీఆర్ నిర్ణయాన్ని ఇన్‌డైరెక్ట్‌గా తప్పని చెప్పారు. రైతులు కొనుగోలు కేంద్రాలు ఉండాల్సిందే అని కోరుతున్నారని చెప్పిన ఈటెల.. ఐకేపీ సెంటర్లు ఉండాల్సిందే, ధాన్యం కొనుగోలు జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. తాను మంత్రిగా ఉన్నా.. ఇంకో పదవిలో ఉన్నా.. రైతు ఉద్యమానికి తన మద్దతు ఉంటుందని తెలిపారు.
ఇక రైతు బంధు పథకం అమలులోని తప్పులను కూడా అంగీకరించారు. రైతు బంధు పథకం మంచిదే కానీ ఆదాయపు పన్ను కట్టే వాళ్లకు, రియల్ ఎస్టేట్ చేసే భూములకు, వ్యవసాయం చెయ్యని గుట్టలకు, లీజుకి ఇచ్చే భూములకు రైతు బంధు ఇవ్వవద్దని రైతులు కోరుతున్నారన్న ఈటెల.. ఆ విషయాన్ని కూడా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పుకొచ్చారు. ఈటెల తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.