ప్రస్తుతం టీఆర్ఎస్ శ్వాస.. ధ్యాస అంతా హుజూరాబాదే. ఈటలను ఓడించాలి.. పరువు కాపాడుకోవాలి. ఎలాగైనా గెలవాలి. దానికోసం ఏమైనా చేయాలి. ఏమైనా అంటే మీకు అర్థం అయ్యే ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో హుజూరాబాద్ గెలుపు అంత ఈజీ కాదు. దాన్ని ముందే గ్రహించిన కేసీఆర్.. కులాలవారీగా తాయిలాల ఇస్తూ.. కోట్లు కుమ్మరిస్తూ.. గెలుపు తీరం చేరాలని చూస్తున్నట్లుగా ఈటల వర్గం ఆరోపిస్తోంది. తమ నాయకుడికి వెన్నుదన్నుగా ఉన్నవారిని వారివైపు లాగేయడం.. సొంత పార్టీ నేతలు బయటకు పోకుండా చూసుకోవడం.. కోరిన కోర్కెలు తీర్చడం లాంటివి చేస్తున్నారనేది ప్రముఖంగా ఈటల ఫ్యాన్స్ చేస్తున్న ఆరోపణ. రాజేందర్ కూడా ప్రచారంలో వీటినే హైలెట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. సొంతపార్టీ నేతలనే కొన్న నీచ స్థితికి దిగజారిపోయారంటూ విమర్శలు చేస్తున్నారు.
ఈటల రాజేందర్ ఆరోపణలు ఏమోగానీ.. ఆయన వర్గం వారిని టీఆర్ఎస్ తమవైపు లాగేసుకుందనేది ప్రజల్లోకి బలంగా వెళ్లింది. తాజాగా ఎన్నికల ప్రచారంలో జరిగిన సంఘటనతో ఇది రుజువైందని అంటున్నారు ఈటల ఫ్యాన్స్. ఇల్లందకుంట మండలం రాచపల్లిలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జరుగుతోంది. మంత్రి హరీష్ రావు సారథ్యంలో అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సహా ఇతర నాయకులు ప్రచార రథంపై ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ నాయకుడు కేసీఆర్ నాయకత్వం అని అన్నాడు. వెంటనే కింద ఉన్న కార్యకర్తలంతా వర్ధిల్లాలి అంటూ గట్టిగా అరిచారు. అదే ఊపులో ఈటల రాజేందర్ నాయకత్వం అని అనగానే.. అందరూ వర్ధిల్లాలి అని నినదించారు. అంతే ఒక్కసారిగా అంతా షాక్. హరీష్ రావు, కౌశిక్ రెడ్డి ఫేస్ లోని హావభావాలు వర్ణణాతీతం.
వెంటనే మైక్ అందుకున్న హరీష్.. దీన్ని కవర్ చేసే ప్రయత్నం చేశారు. అలవాటులో పొరపాటు.. 15 ఏళ్ల నుంచి ఈటలతో దోస్తానా అలాగే ఉంటుందని అన్నారు. అయితే ఈటల ఫ్యాన్స్ మాత్రం కౌంటర్ ఎటాక్ కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్ లో ఉన్న చాలామంది ఈటలవైపే ఉన్నారని.. గులాబీ నేతల బెదిరింపులకు భయపడి ఆపార్టీలో ఉంటున్నారని చెబుతున్నారు. వారిలో ఈటలపై అభిమానం చావలేదని తాజా సంఘటనే దానికి నిదర్శనమని అంటున్నారు.