యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లెయిన్ నేడు భారత్ కు రానున్నారు. రెండో రోజుల పర్యటనలో భాగంగా ఆమె నేడు భారత్ కు చేరుకుంటారు. ఇండియా-యూరోపియన్ యూనియన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతంపై భారత్ తో ఆమె చర్చించనున్నారు.
యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలి హోదాలో ఆమె భారత్‌కు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆమె పర్యటన విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పేర్కొంది.
‘యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండేర్ లెయిన్ కు భారత్ సాదరంగా స్వాగతం పలుకుతోంది. ఏప్రిల్ 25న ప్రారంభం కానున్న రైసినా చర్చలకు ముఖ్య అతిథిగా ఆమె వ్యహరించనున్నారు’అని భారత విదేశాంగ శాఖ తన ట్వీట్ లో పేర్కొంది.
ఆమె తన పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు. ప్రధాని మోడీతో ఆమె ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. వాతావరణ మార్పులు, జీవవైవిద్యం, శక్తి, కనెక్టివిటీ, రక్షణ, భద్రత అంశాలపై ప్రధాని మోడీతో ఆమె చర్చించనున్నట్టు సమాచారం .