దేశ రాజధాని ఢిల్లీలో ఓ భవనం ఉన్నట్టుండి కూలిపోయింది. భజన్ పురా ప్రాంతంలో విజయ్ పురా పార్క్ సమీపంలో చూస్తుండగానే భవనం ఒక్క సారిగా కుప్ప కూలడంతో అంతా భయాందోళనలకు గురయ్యారు. భయంతో ఒక్క సారిగా పెద్దగా కేకలు వేశారు.
వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. సమాచారం అందుకున్న భజన్ పురా, జఫర్ బాద్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు మొదలు పెట్టారు.
అధికారులు శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఆ భవనాన్ని గతంలోనే ప్రమాదకరమైనదిగా ప్రకటించామని అధికారులు తెలిపారు. దీంతో 12 రోజుల క్రితమే భవనంలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతానికి తరలించామన్నారు.
మరోవైపు ఈ నెల 1న ఢిల్లీలోని రోషనారా రోడ్డులో నాలుగంతస్తుల భవనం ఒకటి కూలింది. లాజిస్టిక్స్ కంపెనీకి చెందిన ఆ భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడకు వెళ్లి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అంతలోనే భవనం ఒక్కసారిగా కూలిపోయింది.