ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ మొదలైంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి వారిని భారత్ కు రెండు విమానాల్లో తరలిస్తున్నారు. అందులో ఒకటి ఢిల్లీకి శనివారం ఉదయం 11 గంటలకు చేరుకోనుంది. మరో విమానం సాయంత్రం 4 గంటలకు ముంబైని చేరుకోనుంది. వారికి చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ స్వాగతం పలకనున్నారు.
ఇప్పటికే ఉక్రెయిన్ లోని భారతీయులు రోడ్డు మార్గం ద్వారా రొమేనియా సరిహద్దులకు చేరుకుంటున్నారు. వారిని బుచరెస్ట్ ప్రాంతానికి భారత అధికారులు తరలిస్తున్నారు. అక్కడి నుంచి వారిని ఎయిర్ ఇండియా విమానం ద్వారా భారత్ కు తీసుకురానున్నారు.
రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ తన గగన తలాన్ని మూసివేసింది. దీంతో అప్పటి నుంచి ఉక్రెయిన్ లో పౌరవిమానయాన కార్యకలాపాలు జరగటం లేదు. ఈ క్రమంలో తరలింపు విమానాలను బుకారెస్ట్, బుడాపెస్ట్ అవతల నుంచి ఆపరేట్ చేస్తున్నారు.
అంతకు ముందు ఫిబ్రవరి 22న ఉక్రెయిన్ రాజధాని కైవ్ నుంచి 240 మంది భారతీయులను ఎయిర్ ఇండియా విమానం ద్వారా భారత్ కు తరలించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 24, 26 తేదీల్లో మరో రెండు విమానాల ద్వారా తరలింపు ప్రక్రియ కొనసాగించాలని పయత్నాలు జరిగాయి. కానీ అప్పటికే ఉక్రెయిన్ తన గగనతలాన్ని మూసివేసింది.