ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో రాజకీయ వివరణలను వివరించడమే కాకుండా సాధారణ జీవితంలోనూ ఎన్నో ఉపయోగపడే ప్రాథమిక విషయాల గురించి కూడా వివరంగా చెప్పాడు. జీవితంలో సహాయం అనేది కూడా కొందరికి మాత్రమే చేయాలని ఎట్టి పరిస్థితుల్లోనూ… ఇలాంటి వారికి సహాయం చేయకూడదని తెలిపాడు.
దుష్ట స్వభావం ఉన్న స్త్రీకి, ఇతరులను అవమానించే స్త్రీకి ఎప్పుడూ సహాయం చేయకూడదు. ఆమె మీ సహాయాన్ని దుర్వినియోగం చేసే అవకాశాలున్నాయి. మీరు అలాంటి స్త్రీకి దయా గుణంతో సహాయం చేసినప్పటికీ, అది మీకు భారంగా పరిణమిస్తుంది. అలాంటి స్త్రీ విషసర్పం లాంటిది. అలాంటి స్త్రీ పిల్లలకు కూడా ఈ లక్షణాలను నేర్పిస్తుంది. దీంతో ఆ చిన్నారులు కూడా ఈ అవలక్షణాలను మరింతగా వ్యాపింపజేస్తారు. అలాంటి స్త్రీకి డబ్బుపై మాత్రమే ప్రేమ ఉంటుంది. ఇలాంటి స్త్రీలు ఎప్పటికీ ఇతరులకు సహాయం చేయరు.
మూర్ఖుడికి ఉపదేశించడం అనేది సమయాన్ని పూర్తిగా వృథా చేసుకోవడమేనని ఆచార్య చాణక్య తెలిపారు. మూర్ఖుడు ఎదుటివారిని తన వాదన ద్వారా ఓడించడానికి ప్రయత్నిస్తాడు. ఎదుటివారు చెప్పే ప్రతి మాటను అహంకార పూరితంగా స్వీకరించి వారికి శత్రువుగా మారతాడు. తెలివితక్కువ వ్యక్తులతో వాదనకు దిగితే మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. మూర్ఖుడితో స్నేహం చేస్తే మీకు దుఃఖం తప్ప మరేమీ మిగలదు.
ఎల్లప్పుడూ విచారంగా ఉండేవారు కొద్దిపాటి ఆనందాన్ని కూడా ఆస్వాదించలేక లోలోన కుమిలిపోతుంటారు. వీరి విచారం ఎదుటి వ్యక్తికి హాని కలిగిస్తుంది. ఎప్పుడూ విలపించే వారు ఇతరుల సంతోషాన్ని చూసి అసూయపడుతుంటారు. చెడు భావాలతో రగిలిపోతుంటారు. అలాంటివారికి ఎప్పుడూ దూరంగా ఉండండి. ఎందుకంటే వారు సంతోషంగా ఉన్నట్లు నటిస్తూ, ఎదుటివారిని ప్రతికూల వాతావరణంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తారు.