శ్రీరామ నవమి రోజున పలు రాష్ట్రాల్లో చెలరేగిన హింసపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సామ్నా పత్రికలో తన వీక్లీ కాలమ్ రోహతక్ లో రాశారు. మధ్యప్రదేశ్ లోని కర్గోన్ ప్రాంతంలో జరిగిన హింసను చూసి ఆ శ్రీరాముడు సైతం అశాంతిగా ఉంటారని ఆయన అన్నారు.
మసీదుల్లో లౌడ్ స్పీకర్లను రాష్ట్ర ప్రభుత్వం మే 3 లోగా తొలగించాలని, లేదంటే మసీదుల ముందు హనుమాన్ చాలీసా వినిపిస్తామని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన రాజ్ థాకరే అన్న వ్యాఖ్యలను కూడా ఆయన అందులో ప్రస్తావించారు.
శ్రీరామ నవమి రోజు జేఎన్ యూ, ఇతర ప్రాంతాల్లో జరిగిన ఘటనను గురించి వివరిస్తూ.. ఇది దేశానికి మంచి సంకేతం కాదన్నారు. రామనవమి రోజు ఊరేగింపులు మన సంస్కృతిలో భాగమన్నారు. కానీ శ్రీరాముని పేరిట గతంలో ఎప్పుడూ కత్తులు దువ్వలేదన్నారు.
ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో రామనవమి ఊరేగింపుపై ముస్లింలు రాళ్లు రువ్వుతారని ఎవరైనా నమ్మగలరా? సంజయ్ రౌత్ ప్రశ్నించారు.
‘ ముంబైలో శివసేన హిందుత్వ ఊరేగింపు నిర్వహిస్తే, దానిపై దాడి జరగలేదు. కానీ బీజేపీ లేదా దాని బీ-టీమ్ అటువంటి ఊరేగింపులను నిర్వహిస్తే, అది ఖచ్చితంగా అవాంఛనీయ ఘటనలకు దారితీస్తాయన్నారు. అలాంటి ఏర్పాట్లను పార్టీలే చేసినట్లు తెలుస్తోంది’ అని రౌత్ అన్నారు.