ప్రధాని మోడీని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పొగడ్తలతో ముంచెత్తారు. కలలను సాకారం చేయొచ్చని ఈ ప్రపంచానికి ప్రధాని మోడీ చాటి చెప్పారని ఆయన అన్నారు.
‘మోడీ @20: డ్రీమ్స్ మీట్ డెలివరీ’ అనే పుస్తకాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సమక్షంలో ఢిల్లీలో ఆయన విడుదల చేశారు.
ప్రధాని మోడీపై సరైన విశ్లేషణను అత్యద్భుతంగా పుస్తకంలో అందిచారంటూ రచయితను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. దిగ్గజ నాయకుడి 20 ఏండ్ల ప్రయాణాన్ని రచయితలు అద్భుతమైన రీతిలో ఆవిష్కరించారని ఆయన కొనియాడారు.
ఈ పుస్తకం అరుదైన సంకలనమని ఆయన తెలిపారు. ఇది ఆధునిక భారత్లోని అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుల్లో ఒకరి జీవితంలోని పరిణామాలను పాఠకులకు అందిస్తోందన్నారు.
జాతీయ స్థాయిలో ప్రధాని మోడీ ఒక అద్భుతమన్నారు. మోడీ ప్రయాణం, మాటలు, పనులు, కలలు, వాటి సాకారాన్ని అర్థం చేసుకోవాలన్నారు.
దేశ ప్రజల కోసం ఆయన ఎలా పెద్ద కలలు కనగలుగుతున్నారో, కోట్లాది మందిని ప్రభావితం చేసే ఆ కలలను ఏ విధంగా ఆచరణలో పెట్టగలుగుతున్నారనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకునేందుకు ఈ పుస్తకం సహాయపడుతుందన్నారు.