నిజామాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ ఎదురైంది. జిల్లా కేంద్రంలో పర్యటనకు వచ్చిన రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కాన్వాయ్ ను నిరసన కారులు అడ్డుకున్నారు. కంఠేశ్వర్ చౌరస్తాలో కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్, ఎన్ఎస్ యూఐ నాయకులు అడ్డుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
హెలిప్యాడ్ నుంచి భూమారెడ్డి కన్వెన్షన్ లో కాకతీయ సాండ్ బ్యాక్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న రైతులతో ఇంటరాక్షన్ కు కేటీఆర్ వెళ్తుండగా హఠాత్తుగా కాన్వాయ్ కి కాంగ్రెస్ నాయకులు అడ్డుతగిలారు. ఎదురుగా వచ్చి’ కేటీఆర్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. పోలీసుల రక్షణ వలయాన్ని చేధించి కాన్వాయ్ కి అడ్డు రావడంతో పోలీసులు షాక్ కు గురయ్యారు.
తేరుకొని అక్కడికక్కడే వారిని అరెస్ట్ చేసి స్థానిక పోలీసు స్టేషన్ కు తరలించారు. మంత్రి కేటీఆర్ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రతిపక్ష నాయకులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. అయినా కాంగ్రెస్ నాయకులు మంత్రి కాన్వాయ్ ని అడ్డుకోవడం కలకలం రేపింది. కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్ గత ఏడాది సీఎం కేసీఆర్ పర్యటనను అడ్డుకొని కలకలం రేపారు. ఆ సమయంలో అధికారులను బాధ్యులను చేస్తూ సీఐ, ఎస్ఐలను సస్పెండ్ చేశారు. మరి ఈ సారి కూడా ఆయనే మంత్రి కేటీఆర్ పర్యటనను అడ్డుకోవడంతో పోలీసులపై వేటు పడుతుందన్న చర్చ మొదలైంది.