ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో.. ఈ ఏడాది ఉగాది పంచాంగ శ్రవణం రాజకీయ పార్టీల్లో చాలా ఆసక్తికరంగా మారింది. రాష్ట్రాన్ని పాలించే రాజుకు వ్యతిరేకత తప్పదని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పండితులు చెప్పిన మాటలు ఇప్పటికే బీఆర్ఎస్ లో కలవరాన్ని కల్గిస్తున్నాయి. ఇక గాంధీ భవన్ లో కూడా శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.
ఇక్కడ కూడా పంచాంగ శ్రవణం జరిగింది. ఈ సందర్భంగా వేద పండితులు చిలుకూరు శ్రీనివాస మూర్తి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన పెరుగుతుందని తెలిపారు. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో నష్టం జరుగుతుందని, నూతన రాజకీయ కూటములు ఏర్పడతాయన్నారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా ప్రజలు పాలక పక్షం వైపు ఉంటారన్నారు.
సరిహద్దు వివాదాలు పెరుగుతాయని, నదులు పొంగి ప్రవహిస్తాయన్నారు. గంగానది పుష్కరాలు ఏప్రిల్ 23 నుంచి మొదలుకానున్నట్లు తెలిపారు.ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. అల్లర్లు ప్రజలను ఇబ్బంది పెడతాయన్నారు. రేవంత్ రెడ్డికి అందరూ సహకరించాలని.. అందరూ ఆయన వెంట నడవాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. రాహుల్ గాంధీ స్ఫూర్తితో బలహీన వర్గాలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజలకు నచ్చితే అధికారం ఇస్తారని.. వారికి నచ్చేలా నడుచుకోవాలని సూచించారు.