బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్‌గా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆమె ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై, సీఎస్ శాంతి కుమారి, హోం మంత్రి మహ్మద్ అలీ పాల్గొన్నారు.
రాష్ట్రపతి నిలయంలోని నాలెడ్జి గ్యాలెరీ, కిచెన్ టన్నెల్, వాటితో పాటు విజిటర్ ఫెసిలిటీస్ సెంటర్స్, పలు ఫౌండేషన్ స్టోన్స్, మెట్ల బావులను ఆమె ప్రారంభించారు. రాష్ట్రపతి నిలయాన్ని రేపటి నుంచి ప్రజలు సందర్శించేందుకు అనుమతించే కార్యక్రమానికి కూడా ఆమె శ్రీకారం చుట్టారు.
హైదరాబాద్ రాష్ట్రపతి నిలయంలో బస చేసే అవకాశం తనకు గత నెలలో దొరికిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి నిలయానికి సంబంధించిన చరిత్ర వివరాలు నాలెడ్జ్ గ్యాలరీలో లభిస్తాయని తెలిపారు. రినోవెట్ చేసిన కిచెన్ టన్నెల్‌ను తెలంగాణ సాంప్రదాయ కళతో నిర్మించారని వెల్లడించారు.
బట్టర్ ఫ్లై, రాక్, నక్షత గార్డెన్స్, స్టెప్ వెల్స్ ప్రారంభించడం తనకు చాలా సంతోషంగా వుందన్నారు. ప్రజలందరూ రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించాలని రాష్ట్రపతి చెప్పారు. అనంతరం ప్రజలకు గవర్నర్ తమిళి సై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.