ఏఐసీసీ పిలుపుతో దేశ వ్యాప్తంగా జరుగుతున్న హాథ్ సే హాథ్ జోడో యాత్రను ఆరో తేదీ నుంచి ప్రారంభించనున్నారు. యాత్రలో నాయకులు, కార్యకర్తలందరూ పాల్గొనాలని ఏఐసీసీ కోరింది. ఇటీవల జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో 119 అసెంబ్లీ నియోజక వర్గాలకు గాను 50 నియోజక వర్గాల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటిస్తారని రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే తెలిపారు.
ఇక మిగిలిన నియోజక వర్గాల్లో ఎవరెవరు పర్యటిస్తారో వివరాలు ఇవ్వాలని నాయకులను కోరారు. మాణిక్ రావ్ ఠాక్రే సాయంత్రం హైదరాబాద్ కు వచ్చి 6 వ తేదీ వరకు ఇక్కడే ఉంటూ గాంధీ భవన్ వేదికగా పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. సమావేశంలో హాథ్ సే హాథ్ జోడో యాత్ర విజయవంతం చేసేందుకు పార్టీపరంగా తీసుకుంటున్న చర్యలపై చర్చించనున్నారు. అనంతరం రూట్ మ్యాప్ లపై స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.
మరో వైపు రేవంత్ రెడ్డి 50 నియోజక వర్గాల్లో పర్యటించేందుకు సర్వం సిద్ధమైంది. అన్ని రకాల సౌకర్యాలు ఉండేట్లు 4 కార్వాన్ వాహనాలను సిద్ధం చేసుకున్నారు. నాయకుల ప్రసంగాలకు ఎలాంటి స్టేజీలు ఉండనందున అందు కోసం ఓ ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేశారు. పాదయాత్రలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలుగా 125 హార్స్ పవర్ కలిగిన 3 జనరేటర్లు, సౌండ్ సిస్టమ్ నకు చెందిన 2 వాహనాలు,కళాకారులు ఆటపాట ఆడేందుకు మరో రెండు వాహనాలు సిద్దం చేశారు.
అయితే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వివిధ రూపాల్లో జనంలోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసిన తరువాత ఆ యాత్రకు కొనసాగింపుగా దేశ వ్యాప్తంగా రెండు నెలల పాటు హాథ్ సే హాథ్ జోడో యాత్ర కొనసాగనుంది.