రాష్ట్రంలో జగన్ సర్కార్ వచ్చాక వరుసగా పారిశ్రామిక ప్రమాదాలు జరగడం, వాటికి కార్మికులు బలవ్వడం సర్వ సాధారణమైపోయిందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
విశాఖ అచ్యుతాపురంలోని పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై పర్యవేక్షణ లేదని ఆయన మండిపడ్డారు.
పర్యవేక్షణ ఉండి ఉంటే ఇన్ని ప్రమాదాలు జరగవని అన్నారు. లోపమంతా ప్రభుత్వంలోనే ఉందన్నారు. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని పారిశ్రామిక ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ ఏడాది జూన్ 3న అచ్యుతాపురం సెజ్‌లోని సీడ్స్ వస్త్రపరిశ్రమలో విషవాయువులు లీకయ్యాయి. ఈ ఘటనలో 469 మంది మహిళా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ ప్రమాదంపై విచారణ కమిటీని ప్రభుత్వం నియమించిది. అయితే ప్రమాదానికి గల కారణాలేంటో కమిటీ వెల్లడించలేదు.
తాజాగా అదే ఇండస్ట్రీలో ఇప్పుడు మరోసారి విషవాయువుల వెలుపడ్డాయి. ఆ విషవాయువును పీల్చి దాదాపు 100 మంది మహిళా కార్మికులు అనారోగ్యం పాలయ్యారు.